
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన షైన్ టామ్ చాకో అక్కడినుంచి పరారైనట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తు నుంచి దూకి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఆ విజువల్స్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు.
తాజాగా పోలీసు విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్‌స్టేషన్‌కు ఆయన వచ్చారు. విచారణ అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటారని గతంలోనే పలుమార్లు వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై పదునైన విమర్శలు చేసింది. సినిమా సెట్‌లోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో తన పట్ల చాలా అభ్యంతరకరంగా ఆయన వ్యవహరించారని ఆమె చెప్పింది.
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.