
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్‌లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)
మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్‌కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం.