‘‘కొండపొలం’ ఫైనల్ కాపీ చూసినప్పుడు ‘ఇదీ సినిమా అంటే’ అనిపించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ..‘‘కీరవాణిగారు మా సినిమాకి ఓ గైడ్‌లా పని చేశారు. ‘కొండపొలం’ హిట్ అనేది నాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి చాలా అవసరం.
ఇప్పుడున్న థియేటర్లకి, మా మనుగడకు అవసరం. చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు’’ అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ...‘‘నా మొదటి చాప్టర్ ‘ఉప్పెన’ అయితే రెండో చాప్టర్ ‘కొండపొలం’. ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్, రాజీవ్, జ్ఞానశేఖర్‌గార్లకు మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాళ్లు చాలా కష్టపడ్డారు.. వారందరి కష్టమే ఈ ‘కొండపొలం’. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలనే ఒక స్ఫూర్తిని మా సినిమా కలిగిస్తుంది. రవీంద్ర అనే ఓ మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు క్రిష్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు.
రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’, వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండపొలం’ మేమే నిర్మించాం. ‘కొండపొలం’తో వైష్ణవ్ స్టార్ అవుతాడు. రకుల్ ఎంతో అంకితభావంతో ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసినందుకు థ్యాంక్స్. క్రిష్‌కి గ్రేట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని జీవితాలను చూసి నేను రాసిన పాత్రలకు క్రిష్‌గారు తెరపై జీవం పోసి, సినిమాగా తీశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, లక్ష్మీకాంత్ చెన్నా, పాటల రచయిత చంద్రబోస్, నటి హేమ, ‘మ్యాంగో మీడియా’ రామ్, నటులు సాయిచంద్, రవి, మహేశ్ విట్టా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment