
శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. తెలుగులో ఉప్పెన చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు అలా రెండు మూడు చిత్రాలతో విజయ బాటలో పయనించింది. ఆ తరువాత వరుస ప్లాపులతో చతికిలపడింది. ది వారియర్ చిత్రంతో కోలీవుడ్‌కు కోటి ఆశలతో ఎంటర్ అయ్యింది. అయితే ఆమె లక్ ఇక్కడ పని చేయలేదు. ఆ చిత్రమే కాదు ఆ తరువాత ఇక్కడ విడుదలైన కస్టడీ చిత్రం కూడా నిరాశపరిచింది.
ఇక నేరుగా బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించే అదృష్టం కలిగింది అని సంబరపడే లోగానే ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. అలాంటి నిసృహ మధ్య కృతిశెట్టికి మరో లక్కీ చాన్స్ తలుపు తట్టింది. హీరో కార్తీతో జత కట్టే అవకాశం వరించింది. ఈ జంట నటిస్తున్న చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు సూదుకవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన నలన్ కుమారసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది కార్తీ నటిస్తున్న 26వ చిత్రం కావడం గమనార్హం. కాగా దీనికి 'లో వాద్ధియారే' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలిసింది. కాగా నటి కృతిశెట్టి ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇకపోతే నటుడు కార్తీ నటించి పూర్తి చేసిన జపాన్ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment