టైటిల్: కుల్లనారి కూట్టం(2011)
నటీనటులు: విష్ణు విశాల్, రమ్య నంబీషన్, సూరి తదితరులు
దర్శకత్వం: శ్రీబాలాజీ
సంగీతం: వి.సెల్వగణేష్
సినిమాటోగ్రఫీ: జే.లక్ష్మణ్
ఎడిటర్: కాశీ విశ్వనాథన్
విడుదల తేది: మార్చి 25, 2011
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
‘కుల్లనారి కూట్టం’ కథేంటంటే..
"సరే! రీచార్జ్ చెయ్యాల్సిన నెంబర్ చెప్పండి" అనడిగింది ఆ మోబైల్ షాపు అమ్మాయి ."9445199205" అన్నాడు ఆ అబ్బాయి. చివరి టూ జీరో పైవ్ అంటే రెండు సున్నాలు ఒక అయిదు అనుకుని ఆ 9445199005 నెంబర్కు రూ: 1500 రీచార్జ్ చేసింది ఆ అమ్మాయి . ఆ డబ్బులు సరాసరి ప్రియా నంబియార్ అనే ఎంతో చూడచక్కని అమ్మాయి మోబైల్ కు రీచార్జ్ అయ్యింది. అలా మొదలయ్యింది ఈ సినిమా కథ .ఆ కుర్రవాడి పేరు వెట్రివేళ్(విష్ణువిశాల్). అతని తండ్రి తనను ఒకరోజు పదిహేను వందల రూపాయలు కొడుకు చేతిలో పెట్టి తన మొబైల్ రీచార్జ్ చేయించమన్నాడు. ఆ డబ్బు తన తండ్రి మొబైల్ కి కాకుండా అలా ఊరూ పేరూ తెలియని ఓ ఆందగత్తె పాలయ్యింది. ఉద్యోగం గట్రా ఏవి లేని వెట్రివేళ్ కి ఉన్న ఆదాయమల్లా రోజువారి పాకెట్ మనీ స్కీములో లభించే కేవలం రూ 10 మరి ఎలాగని? ఎక్కడినుంచని? ఇంకో 1500 సంపాదించి తండ్రి పోన్ రీచార్జి భారం తీర్చుకుంటాడు? అదంతా ఆ చావంతా, ఆబ్రతుకంతా ఆ ముచ్చటంతా మీరు ఈ సినిమా చూసి తీర్చుకోదగ్గ ముచ్చట.
విశ్లేషణ
కొన్ని ప్రయత్నాల అనంతరం వెట్రివేళ్ ఆ అమ్మాయి దగ్గరినుండి డబ్బునూ, ఆ వెనువెంటనే ఆ అమ్మాయి మనసుని కూడా అంది పుచ్చుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో ఏ మాత్రం అలుపు సొలుపు బోర్ కు గురిచేయకుండా దర్శకుడు హాయి హాయిగా సినిమాలోకంలో మనల్ని ఊయాలలూపుతూ ఉంటాడు. సర్వసాధారణమయిన సినిమాల్లో పనీ గినీ లేని హీరో పక్కన మరో పనీ గినీ లేని ఒక విదూషక ఫ్రెండ్ పాత్ర పెట్టి మనల్ని అనవసరంగా నవ్వించే ప్రయత్నం దర్శకుడు శ్రీ బాలాజీ అసలు చెయ్యలేదు.
ఈ సినిమాలో అనవసరం అనిపించే పాత్ర ఒక్కటీ లేదంటే అదే అశ్చర్యం! పైగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించారో! హీరో తల్లి ఎంత బాగా నటించిండో కదా అని మనం ఆశ్చర్యపోతూంటే ! మామూలు సినిమ్మా తండ్రి కూడా ఎంత హాయిగా నటించాడో అని ఇంకా నిబిడాశ్చర్య పోతాము ! ఇక వేట్టి అన్నయ్య సంగతి కాదు కానీ తమిళ సినిమాల్లో అన్నపాత్రలు వేసే వారంతా అంత చక్కని నటులేంటో!
వదిన మాత్రం తక్కువ నటించిందా ఏమిటి? . సిన్మా చివర్లో వచ్చిన ఆరు మంది మిత్రులు, వారి తోడుగా దూరిన కొంత పోలీసు వారు. వారని వీరని కాదు ఈ సినిమాలో మొహానికి రంగు వేసుకున్న ప్రతి పాత్రధారి మోసం అంటే అద్భుతం అన్నంత బాగా నటించారు . ఒక సీన్ లో తండ్రి చేతిలో స్కూల్ పిల్లల పరిక్ష పత్రాలు ఉంటాయి . ఒక్క సెకను మాత్రమే కనపడే సీన్ అది . సినిమా లో ఒక పాత్ర స్కూలు మాస్టరు అయినంత మాత్రానా ఆయన ఇంటికి ఆ కాగితాలు తీసుకెళ్ళి రాత్రి దిద్ది ఉదయం బడికి పట్టుకెడుతున్నాడనే చిన్న బ్యూటిఫుల్ డిటయిల్ ప్రేక్షకుడికి ఇవ్వాలని ప్రేమకలిగిన దర్శకుడిని ఊరికే ఒట్టి మాటల్తో ఎట్టా ప్రేమించగలం. దేవుడా! ప్రేమించలేకపోవడం ఎంత కష్టం కష్టం!!
సరే మళ్ళీ కథలోకి వద్దాం. వెట్రి, ప్రియా ల ప్రేమని హీరోయిన్ తండ్రి ఒకలా ఒప్పుకుంటాడు. నాయనా నీకూ, మా అమ్మాయికి పెళ్ళి కావాలంటే పరమ సింపుల్‌గా నువ్వు మిలట్రీ ఉద్యోగం అయినా సంపాదించు లేదా పోలీసు వాడివయినా అవ్వమనేది షరతు. హీరోయిన్ అమ్మాయి వాళ్ళ ది ఒక విచిత్రమైన ఊరు. ఆ ఊర్లో ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు మిలట్రీలో చేరి భారత్ మాతా కి సేవలో తరించే వాళ్ళే. మామూలుగా నిత్యజీవితాల్లో ఉద్యోగం సంపాదించడం అనేది కష్టం కావచ్చు కానీ, భారతీయ సినిమా హీరోకి- అందునా తెలుగు మరియు తమిళ హీరోలకి అసాధ్యం ఐనది ఏది?
మీకెవరికయినా ఆడవి దోంగ అనే ఎనభైలనాటి సినిమా గుర్తు ఉందా? మాటలు కూడా రాని బ్బే బ్బే బ్బే అనే కథానాయకుడు . హీరోయిన్ రాధ వడిలో పడుకుని ముప్ఫై రోజుల్లో తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ కూడా నేర్చుకుని ఆ పై పుంజీడు రోజుల్లో జిల్లా కలెక్టరో, సుప్రీంకోర్ట్ జడ్జి వంటిది కూడా ఒకటి అయ్యి ప్రేక్షక దేవుళ్లతో చెవులు చిల్లులు పడేంత వీలలు , చిల్లర వేయించుకుంటాడు కదా. అడిగాడా మన సినిమా ఘన చరిత్ర ! మిలటరీలో చేరడానికి మరిక ప్రాబ్లెం ఏవిటి మన హీరోకి? అంటే ఏం చెప్పను? సినిమా చూడరాదు, ప్రాబ్లెమ్ ఏమిటో !
ఎంత బాగుందో ఈ సినిమా . కథ బావుంది, నడిపిన కథనం బావుంది. నటీ నటులు అందరూ బావున్నారు. అంత మంచి సినిమా చివర్లో వచ్చే కాస్త డ్రామా అంతగా ఆకట్టుకోదు! అయినా పర్లా ఆ అయిదు నిముషాల క్లైమాక్స్ అలా కన్నా ఇక మరలాగైనా తీయలేరేమో లే పాపం అని క్షమించేంత బావుంది.
Comments
Please login to add a commentAdd a comment