Matti Kusthi Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ

Published Fri, Dec 2 2022 8:18 AM | Last Updated on Fri, Dec 2 2022 9:19 AM

Matti Kusthi Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మట్టి కుస్తీ
నటీనటులు: విష్ణు విశాల్,  ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ రవి తదితరులు
నిర్మాణ సంస్థలు: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
దర్శకత్వం: చెల్లా అయ్యావు 
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ:  రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్: ప్రసన్న జికె
విడుదల తేది: డిసెంబర్‌ 2, 2022

మాస్‌ మహారాజా రవితేజ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’(తమిళంలో-గట్టా కుస్తీ). విష్ణు విశాల్‌ హీరో. ఆయనకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పుడు ఇది స్పోర్ట్స్‌ డ్రామా కావొచ్చని అంతా భావించారు. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర యూనిట్‌ చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మట్టి కుస్తీ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్‌ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్‌ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్‌ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్‌ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్‌) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్‌) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్‌ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్‌ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్ల‌ర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్‌ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
లింగ బేధం లేదని ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల స్త్రీలకు సరైన గౌరవం ఉండడం లేదు. వాళ్లను చిన్న చూపుగా చూసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా మంది భర్తలు చులకనగా వ్యవహరిస్తారు. తన ఇష్టాలను ఆమె గౌరవించాలి కానీ.. భార్య ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదనే భర్తలు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పని, భార్య ఇష్టాయిష్టాలను కూడా భర్తలు గౌరవించాలని చాటి చెప్పే చిత్రమే ‘మట్టి  కుస్తీ’. ఓ మంచి సందేశాన్ని కామెడీ వేలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు చెల్ల అయ్యావు సఫలం అయ్యాడు.

టైటిల్‌ చూస్తే ఇదేదో స్పోర్ట్స్‌ డ్రామా అనుకుంటాం. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.  కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య  వచ్చే మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించడం ‘మట్టి కుస్తీ’ స్పెషల్‌. సినిమా అంతా కామెడీ కామెడీగా సాగుతుంది. తను అనుకున్నట్లుగా భార్య పెద్దగా చదువుకోలేదని, పెద్ద జడ ఉందని భావించే హీరో.. రెజ్లర్‌ అన్న విషయం భర్తకు తెలియకుండా మ్యానేన్‌ చేసే క్రమంలో హీరోయిన్‌ పడే  ఇబ్బందులతో ఫస్టాఫ్‌ అంతా ఫన్‌గా సాగుతుంది. కథంతా ఊహకందేలా సాగుతున్నా.. ఎక్కడా బోర్‌ కొట్టదు. ఇంటర్వెల్‌ ముందు  హీరోయిన్‌ చేసే ఫైట్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది.

హీరోయిన్‌ రెజ్లర్‌ అనే విషయం హీరోకి తెలియడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో  హీరో పరిస్థితి రివర్స్‌ అవుతుంది. ఊరి జనాలంతా తన కంటే భార్యకే ఎక్కువ రెస్పెక్ట్‌ ఇవ్వడం.. అందరి ముందు తన పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకోవడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అయితే భార్య భర్తల ఇగో క్లాషెస్‌ని కామెడీగా చూపిస్తూనే ఎమోషనల్‌ యాంగిల్‌ని టచ్‌ చేశాడు దర్శకుడు. భార్యలు ఎప్పుడూ తమ చెప్పుచేతుల్లోనే ఉండాలనే భర్తల ఆలోచన తప్పనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు. 

ఎవరెలా చేశారంటే.. 
హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విష్ణు విశాల్‌. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. . `రాక్షసన్‌` చిత్రంతో అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మరో  ప్రయోగంగా మట్టి కుస్తీ చేశాడు. ఇందులో వీర పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. కీర్తి పాత్రలో ఐశ్యర్యలక్ష్మీ ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. హీరోతో సమానంగా ఆమె పాత్ర సాగుతుంది. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసింది. వీర మామయ్యగా కరుణాస్‌, కీర్తి బాబాయ్‌గా మునీష్‌ కాంత్‌తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..  జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుంది. పాటలు తమిళ నెటివిటీకి తగ్గట్లుగా ఉంటాయి. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement