‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు.
ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్‌షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్‌షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట.
ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్‌కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment