Manoj Bajpayee- Kamaal Rashid Khan: సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విమర్శకుడు కమాల్ రషీద్‌ఖాన్ (కేఆర్‌కే)కు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి గట్టి షాకిచ్చాడు. కేఆర్‌కేపై పరువు నష్టం దావా వేశాడు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. ఈ మేరకు మనోజ్ బాజ్‌పేయి తరఫు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా మనోజ్ నటించిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కేఆర్‌కే మాత్రం అదొక సాఫ్ట్‌పోర్న్ సిరీస్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అతడిని ఉద్దేశించి.. ‘‘ఒక్క అడల్ట్ సీన్ ఉన్నందుకే సిరీస్‌ను సాఫ్ట్ పోర్న్ అంటావా. నువ్వొక క్రిటిక్. ఇదో పెద్ద జోక్’’ అంటూ విమర్శించాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేనేమీ చెత్త పనులు చేయను. కాబట్టి వెబ్ సిరీస్‌లు చూడను. కాబట్టి సునీల్ పాల్ లాంటి వాళ్లను నువ్వు ఇలాంటి విషయాలు అడగాలి. అయినా, చార్సీ, గంజేదీ(ఎప్పుడూ గంజాయి మత్తులో జోగే) మనోజ్‌ను ఎలా చూడగలుతారో? మత్తు బానిసల వల్ల బాలీవుడ్‌ను ద్వేషించే వాళ్లు.. అలాంటి అందరి వ్యక్తులను ద్వేషించాలి కదా’’ అని కేఆర్‌కే ట్విటర్ వేదికగా స్పందించాడు.
గత నెల 26న చేసిన ఈ ట్వీట్‌పై మనోజ్ బాజ్‌పేయి.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా దాఖలు చేశాడు. ఈ విషయం గురించి మనోజ్ లాయర్ పరేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనోజ్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. సెప్టెంబరు 4న తదుపరి విచారణ జరుగనుంది’’ అని పేర్కొన్నారు. ఇక కేఆర్‌కేకు కేసులేమీ కొత్త కాదు. గతంలో సల్మాన్ ఖాన్ రాధే మూవీ రివ్యూలో భాగంగా.. హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతడి లీగల్ టీం కేఆర్‌కేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదే విధంగా.. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మృతి నేపథ్యంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లో.. ‘‘భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? మనోజ్ సభ్యత లేని వాడు’’ అంటూ కమెడియన్ సునీల్ పాల్ విమర్శించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment