గత 30 ఏళ్లుగా ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పటి నుంచి వెన్నుపోటు పదం రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఈ వెన్నుపోటుపై చర్చ జరుగుతూనే ఉంది. స్వయాన ఎన్టీఆర్ గారే ‘ పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు’అని మండిపడ్డాడు. దీంతో వెన్నుపోటు అనగానే తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు టక్కున గుర్తొస్తాడు. తాజాగా ఈ వెన్నుపోటు డైలాగ్‌తో చంద్రబాబుపై సెటైర్లు పేల్చాడు హీరో విశాల్.
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘మార్క్ ఆంటోని’
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది.
బాబుపై ‘వెన్నుపోటు’ సెటైర్లు
ఇది డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కొన్ని సంభాషణలను పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు గురించి హీరో విశాల్ వేసే సెటైరికల్ డైలాగ్ థియేటర్స్‌లో విజిల్స్ వేయించింది. ఈ సినిమా కథ 1975 నేపథ్యంలో సాగుతున్నప్పుడు ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’సినిమా కోసం హీరో తన స్నేహితుడితో కలిసి థియేటర్‌కి వెళ్తాడు.
అక్కడ ఒకడు కత్తితో హీరోపై దాడి చేస్తాడు. వెనుకవైపు నుంచి పొడిచేందుకు ప్రయత్నించగా.. హీరో వాడిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో వాడి షర్ట్ చిరిగిపోయి.. గుండెలపై ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది. అంటే వాడు ఎన్టీఆర్ అభిమాని అన్నమాట. అది గమనించిన హీరో.. ‘అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా’అంటాడు. వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తుకు రావడం సహజం. అందుకే విశాల్ ఆ డైలాగ్ చెప్పగానే ‘చంద్రబాబు..చంద్రబాబు’అని ఆడియన్స్ గట్టిగా నవ్వుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment