కరోనా క్రైసిస్‌లో సినీపరిశ్రమ కార్మికులతో సహా ఆపదలో ఉన్న ఎందరినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఆపత్కాల సాయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు కోడైరెక్టర్ (లంకేశ్వరుడు చిత్రానికి కో డైరెక్టర్)గా పని చేసిన ప్రభాకర్‌కు ఆపత్కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం చేశారు. వారి పాప చదువుకు అవసరమైన ఫీజులు సాయం చేసి ఆదుకున్నారు.
ఈ సాయంపై ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ నేను దాసరి వద్ద కోడైరెక్టర్‌గా పని చేశాను. చిరంజీవి నటించిన లంకేశ్వరుడికి కోడైరెక్టర్‌గా చేశాను. ఇటీవల `హెల్ప్ లైన్` అనే సినిమా తీసి దర్శకనిర్మాతగా చాలా నష్టపోయాను. ఆ సినిమాని ఎవరూ రిలీజ్ చేయక నష్టపోయాను. సీబీఐటీలో మా అబ్బాయి ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యింది. వాడి సర్టిఫికెట్లు డబ్బు కట్టి తేవాలి. పాప బీబీఏ ఫైనల్ ఇయర్‌కు వచ్చింది. 2.5 లక్షల రూపాయలు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయగలదు. ఎంత ప్రయత్నించినా డబ్బు ముట్టలేదు. దీంతో సాయం కోసం ఎవరిని అర్థించాలి? అనుకున్నాను. నా ఉద్యోగం మాటేమో కానీ.. చెల్లి చదువు పరీక్ష ఫీజు కట్టాలి.. అని నా కుమారుడు అన్నాడు. నా ఇద్దరు పిల్లల భవిష్యత్ని కాపాడుకోలేను.. నా ఇల్లు శ్మశానవాతావరణంలా మారిందని బాధపడ్డాను. కానీ ఏదోలా ప్రయత్నించాను. తెలుగు చిత్రసీమలో చిరంజీవిగారు మాత్రమే ఈ సాయం చేయగలరు. ఆయనను అర్థించేందుకు కలిసాను. 30ఏళ్ల క్రితం లంకేశ్వరుడికి పని చేసినప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమను కనబరిచారు. వెంటనే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారు. ఆ ఫీజును ఇన్ టైమ్‌లో కట్టలేకపోవడంతో హాల్ టికెట్ ఇవ్వలేమని అన్నారు. కానీ చిరంజీవి గారు సాయం చేశారని అనగానే అక్కడ స్టాఫ్ అంతా సాయం చేశారు.
గజేంద్ర మోక్షంలో మొసలికి చిక్కిన గజేంద్రుని కాపాడేందుకు వచ్చిన మహా విష్ణువులా చిరంజీవి నన్ను ఆదుకున్నారు. చిరంజీవి గారు ఆదుకున్నారు అనగానే నా కష్టం విని రామ్ చరణ్ గారి స్టాఫ్ కూడా అంతే సాయం చేశారు. నేను ఈరోజు ఇలా మాట్లాడానంటే దానికి కారణం చిరంజీవి గారు.. రామ్ చరణ్ గారు ఆదుకోవడం వల్లనే’’ అని అన్నారు. పరిశ్రమలో ఎందరికో సాయం చేసిన మెగాస్టార్ ఇటీవల కొందరు ఆర్టిస్టులకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయమందించారు. ఇప్పుడు కష్టకాలంలో పిల్లల పరీక్షలకు ఫీజులు కట్టలేని కోడైరెక్టర్ ప్రభాకర్ని ఆదుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment