అశ్లీలమైన, అసభ్యకరమైన చిత్రాలను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) వివిధ మధ్యవర్తుల సమన్వయంతో చర్య తీసుకుంది. 19 వెబ్‌సైట్‌లు, 18 యాప్‌లను తొలగించేసింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపేసింది. 'సృజనాత్మక వ్యక్తీకరణ' ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తాజాగా తొలగించినట్లు ఠాకూర్ ప్రకటించారు.
బ్యాన్ అయిన ఓటీటీల జాబితా
Dreams Films, Neon X VIP, MoodX, Voovi, Besharams, Mojflix, Yessma, Hunters, Hot Shots VIP, Uncut Adda, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, X Prime, Nuefliks, Prime Play.
ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం అశ్లీలతతో కూడి ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటి వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్‌లను కొన్ని కోట్ల మంది డౌన్‌లోడ్ చేసకుని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్ భారత్‌లో బ్యాన్ అవుతాయి.
IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292 మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కంటెంట్ నిర్ధారించబడింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment