
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా మలయాళంలో (Mollywood) గత నెలలో 17 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని నష్టాల్ని మిగిల్చాయి? అన్న నివేదిక బయటకు వచ్చింది. కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి (కేఎఫ్‌పీఏ) ఫిబ్రవరి బాక్సాఫీస్ రిపోర్టు (Malayalam Film Industry Report- February 2025)ను విడుదల చేసింది.
మాలీవుడ్‌కు రూ.53 కోట్ల నష్టం
ఈ నివేదిక ప్రకారం.. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా (Officer on Duty Movie) మాత్రమే బడ్జెట్‌కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 17 సినిమాల బడ్జెట్ అంతా కలిపితే రూ.75 కోట్లు కాగా.. అందులో కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.53 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.13 కోట్లతో నిర్మితమైన ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా ఇప్పటివరకు రూ.11 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
కాపాడలేకపోయిన స్టార్ హీరో
అయితే ఈ మూవీ నేడు (మార్చి 20) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడనుంది. మార్కో వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఉన్నిముకుందన్ హీరోగా నటించిన చిత్రం గెట్ సెట్ బేబీ. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.1.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమే! లవ్ డేల్ అనే సినిమా అయితే రూ.1.60 కోట్లు పెట్టి తీయగా కేవలం రూ.10 వేలు మాత్రమే తెచ్చిపెట్టి నిర్మాతలను నిండా ముంచేసింది.
పేరు ఘనం.. కలెక్షన్స్ శూన్యం
మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. అయినా పేరు ఘనం.. ఫలితం శూన్యం అన్నట్లు ఎప్పుడూ ఈ ఇండస్ట్రీ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. చాలామంది ఈ చిత్రాలను థియేటర్లలో కన్నా ఓటీటీలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయాలు పెరగడం, నటీనటులు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపడవుతోంది. కనీసం లాభాలు కాదుకదా పెట్టుబడి వెనక్కి వచ్చినా చాలనుకునే దయనీయ స్థితి మాలీవుడ్‌లో కనిపిస్తోంది.
కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన నివేదిక నిజంగా షాక్‌కు గురిచేసింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల్లో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ మూవీ మాత్రమే పెట్టిన పెట్టుబడికి సమీపంలో వసూళ్లు రాబట్టింది. అన్నింటికీ కలిపి రూ.73 కోట్లు పెడితే కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం విచారకరం.
- శ్రీధర్ పిళ్లై, సినీ విశ్లేషకుడు
గ్రాస్: మొత్తం సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు
నెట్: గ్రాస్ వసూళ్ల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగా మిగిలేది నెట్
షేర్: నెట్ వసూళ్ల నుంచి థియేటర్ అద్దె, నిర్వహణ వంటి ఖర్చులు తీసేయగా మిగిలేది షేర్
చదవండి: హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment