దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి విడాముయర్చి అన్న టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా అజిత్ తన తదుపరి చిత్రాలను వరుసగా కమిట్ అవుతున్నట్లు తాజా సమాచారం.
విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 63వ చిత్రం అవుతుంది. కాగా అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన 65వ చిత్రం కూడా దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఆయన ఎవరో కాదు తాజా క్రేజీ దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్ నీల్. కేజీఎఫ్‌తో తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా దర్శకుడుగా మారి తాజాగా సలార్ చిత్రంతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నారు.
దీంతో ప్రశాంత్ నీల్‌కు అవకాశాలు వెంటాడుతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా మైత్రి మూవీ మేకర్స్ మంచి పేరు ఉంది. అజిత్ సినిమాతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పాగా వేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఈయన కేజీఎఫ్ 3, సలార్ 2 చిత్రాలను చేయాల్సి ఉంది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు.
తాజాగా ఈ దర్శకుడిపై అజిత్ కన్నేసినట్లు సమాచారం. తనతో చిత్రం చేయమని ఈయనే స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కోరినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అజిత్ 65వ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందనే సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment