Nandamuri Taraka Ratna's Wife Alekhya Reddy Emotional Post About His Memories - Sakshi
Sakshi News home page

Alekhya Reddy: అయినవాళ్లే దూరం పెట్టారు, ద్వేషించారు.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Mar 18 2023 2:28 PM | Last Updated on Sat, Mar 18 2023 3:00 PM

Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post About His Memories - Sakshi

నందమూరి తారకరత్న.. అలేఖ్యా రెడ్డి.. ఇద్దరూ కలిసి జీవించడానికి ఒక యుద్ధమే చేశారు. అన్ని అడ్డంకులను జయించి ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుని దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి ప్రేమకు గుర్తుగా కూతురు నిషిక, కవలలు తాన్యారామ్‌, రేయా జన్మించారు. కానీ తన కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టివేస్తూ ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు తారకరత్న. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది అలేఖ్య. తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు.. దీంతో తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ తను లేని లోటు గురించి బాధపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది అలేఖ్య.

'నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉన్నాయి. మన పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ ప్రయాణంలో నేను కొంత బెరుకుగా ఉన్నా నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నామంటూ ఎంతో నమ్మకంగా ఉన్నావు. అప్పటి నుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాడావు. చివరికి మన పెళ్లి జరిగింది.

అయినా ఈ వివాహంపై ఒక గందరగోళం. మనపై వివక్ష.. అయినప్పటికీ నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టాక మన జీవితమే మారిపోయింది. మన ఆనందం రెట్టింపైంది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి. 2019లో కవలల జననంతో నీ కల నిజమైంది.

నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెలో ఉన్న బాధ ఎవరికీ అర్థం కాలేదు సరికదా కనీసం దాన్ని పట్టించుకోలేదు కూడా! మనకు బాగా కావాల్సినవాళ్లే మన మనసుకు పదేపదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు సపోర్ట్‌గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోయాం.. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం.. నువ్వు రియల్‌ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement