
నయనతార కెరీర్‌లో 75వ చిత్రం ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 1న థియేటర్స్‌లో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరచేలా ఉందనే వివాదం రేగింది. దాంతో ‘అన్నపూరణి’ ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయింది.
ఈ విషయంపై తాజాగా నయనతార స్పందించి, ఓ లేఖను విడుదల చేశారు. ‘‘బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాశాను. కేవలం కమర్షియల్ అంశాలనే కాదు... సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అనే సానుకూల ఆలోచనతోనే ‘అన్నపూరణి’ సినిమా తీశాం. అయితే మాకు తెలియకుండానే కొందరి మనసులను మేం గాయపరిచామని అర్థమైంది. కానీ ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మా టీమ్‌కు లేదు.
సెన్సార్ సర్టిఫికెట్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన మా మూవీని అక్కడ్నుంచి తొలగించడం అనేది ఆశ్చర్యపరిచింది. నేను భగవంతునిపై నమ్మకంతో ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటాను. అలాంటి నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులను గాయపరచాలని అనుకోను. ఏది ఏమైనా మీ మనోభావాలను గాయపరచి ఉంటే క్షమించండి.. జై శ్రీరామ్’’ అని ఆ లేఖలో నయనతార పేర్కొన్నారు.