Siddharth: ‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ రివ్యూ | Orey Baammardhi Movie Review and Rating in Telugu | Sakshi
Sakshi News home page

Orey Baammardhi Movie Review: మూవీ హిట్టా? పట్టా?

Aug 13 2021 11:59 AM | Updated on Aug 13 2021 12:45 PM

Orey Baammardhi Movie Review and Rating in Telugu - Sakshi

రాజ శేఖర్‌ అలియాస్‌ రాజ్‌(సిద్దార్థ్‌) ఓ సిన్సియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ ట్రాఫిక్‌ పోలీసు అవుతాడు. అతను రాజేశ్వరి అలియాస్‌ రాజీ (లిజోమోల్ జోస్)ని ఇష్టపడతాడు.

టైటిల్‌ : ఒరేయ్ బామ్మర్ది
నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ తదితరులు
నిర్మాణ సంస్థ : అభిషేక్ ఫిలిమ్స్
నిర్మాతలు : రమేష్ పి పిళ్లై
తెలుగు రిలీజ్ :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ -  ఏ.ఎన్ బాలాజీ
దర్శకత్వం: శశి
సంగీతం :  సిద్ధూ కుమార్
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
ఎడిటింగ్‌: సాన్‌ లోకేష్‌
విడుదల తేది : ఆగస్ట్‌ 13,2021

‘బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్‌. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్‌ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా  'ఒరేయ్‌ బామ్మర్ది' అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్‌ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌,ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఆగస్ట్‌ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా సిద్దార్థ్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ‘ఒరేయ్‌ బామ్మర్ది’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ
రాజ శేఖర్‌ అలియాస్‌ రాజ్‌(సిద్దార్థ్‌) ఓ సిన్సియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ ట్రాఫిక్‌ పోలీసు అవుతాడు. అతను రాజేశ్వరి అలియాస్‌ రాజీ (లిజోమోల్ జోస్)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఈ పెళ్లి రాజీ తమ్ముడు, బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన మదన్‌(జీవీ ప్రకాశ్‌ జీవీ)కి ఇష్టం ఉండదు. గతంలో రాజ్‌కి, మదన్‌కి మధ్య జరిగిన ఓ గొడవనే దీనికి కారణం. అయితే రాజ్‌ మాత్రం రాజీని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఏలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి రాజీని రాజ్‌ పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఇంతకి మదన్‌కి రాజ్‌పైన ఎందుకు కోపం? వారి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? తను అంటేనే కోపంగా చూసే మదన్‌తో రాజ్‌ ఏవిధంగా ‘బావ’అని పిలిపించుకున్నాడు? అనేదే మిగతా కథ

నటీ నటులు
ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో సిద్దార్ధ్‌ ఒదిగిపోయాడు. మంచి భర్తగా, బావమరిదిని దారికి తీసుకొచ్చే బావగా చక్కగా నటించాడు. బైక్ రేసులంటూ తిరిగే యువ‌కుడు మదన్‌ పాత్రలో జీవీ ప్రకాశ్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తనదైన ఎమోషనల్‌ యాక్టింగ్‌తో దరగొట్టేశాడు. హీరోయిన్లు కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్‌తో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. బిచ్చగాడులో తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తే.. ఒరేయ్‌ బామ్మర్దిలో బావ, బామ్మర్ది  మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఢిపరెంట్‌ స్టోరీ లైన్‌ తీసుకున్నప్పటీ.. సినిమాలో బలమైన సీన్స్‌ రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభంలోనే అన్ని పాత్రలను పరిచయం చేసి, కథ ఎలా ఉండబోతుందో ముందే చెప్పేశాడు.

ఫస్టాఫ్‌లో అక్కా,తమ్ముడి మధ్యల వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నప్పటీకీ.. ఒక్క సంఘటనతో తల్లిలా ప్రేమించే అక్కతో విడిపోవడానికి సిద్దపడే తమ్ముడి పాత్రలో సీరియస్‌ నెస్‌ లేదనిపిస్తుంది. విలన్‌ పాత్ర కూడా అతికించినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్‌ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా చివరి వరకు ఒకే ఎమోషన్‌తో నడిపించడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్  నేపథ్య సంగీతం. పాటలు మామలుగా ఉన్నప్పటీకీ.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ సాన్‌ లోకేష్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.

ఫ్లస్‌ పాయింట్స్‌
సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ నటన
సంగీతం
లవ్‌ ట్రాక్‌

మైనస్‌ పాయింట్స్‌
రొటీన్‌ స్టోరీ
వర్కౌట్‌ కానీ ఎమోషనల్‌ డ్రామా
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్‌
స్క్రీన్‌ప్లే
సింపుల్‌ క్లైమాక్స్‌
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement