ఆస్కార్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎదురుచూసింది. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ ఆస్కార్ అవార్డు పట్టేసింది నాటు నాటు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్‌ను వెనక్కు నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్‌కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ గుడ్‌న్యూస్ విని అభిమానులు, సెలబ్రిటీలు, సినీప్రేక్షకులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హాండ్(టాప్ గన్ మార్వెరిక్), టీజ్ ఇస్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు పోటీపడిన విషయం తెలిసిందే!
నాటు నాటు పాట విషయానికి వస్తే
టాలీవుడ్‌లో ఇద్దరు యంగ్ స్టార్‌లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియెన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి. అందుకే ఆ మూడ్‌కు తగ్గట్లు కీరవాణి ట్యూన్ సెట్ చేశారు. అందుకు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్‌ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ లిరిక్స్ రాయడం.. యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు తమ గాత్రంతో పాటను ఎక్కడికో తీసుకెళ్లడం.. భాషాహద్దులు చెరిపేస్తూ ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అధికారిక భవనం మరియిన్‌స్కీ ప్యాలెస్ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment