బన్నీ వాసు, మారుతి, అల్లు అరవింద్, చిరంజీవి, గోపీచంద్, రాశీ ఖన్నా, శియా గౌతమ్
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది.
‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్‌లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్‌లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్‌కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment