ముంబై : మోడల్, నటుడు మిలింద్ సోమన్ బీచ్‌లో నగ్నంగా పరిగెడుతున్న వివాదాస్పద చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సినీ నటి పూజా బేడీ సమర్థించారు. నిజానికి ఆ ఫోటో చూడటానికి అంత అశ్లీలంగా ఏమీ లేదని, అది అతని సౌందర్యమని ఆమె అభివర్ణించింది. మిలింద్ చిత్రాన్ని ట్విట్టర్‌లో నాగ సాధువులతో పోల్చి, వీరు బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేనప్పుడు, మిలింద్ ఫోటోలో కూడా కచ్ఛితంగా ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు.
‘‘అశ్లీలత అనేది చూసే వారి దృష్టిలో ఉంటుంది. అందంగా కనిపించడం, ఫేమస్ అవడం, తనకు ఒక బెంచ్ మార్క్‌ను ఏర్పాటు చేసుకోవడం అతను చేసిన నేరమా.? ఒకవేళ నగ్న చిత్రమే నేరమైతే నాగ బాలందరినీ అరెస్ట్ చేయాలి. బూడిద పూసుకొని తిరగడం ఆమోదయోగ్యం కాదని’’ ఆమె ట్వీట్ చేశారు. కాగా, మిలింద్ తన 55 వ పుట్టిన రోజున గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెత్తుతున్నప్పుడు అతని భార్య అంకితా కొన్వర్ తీసిన ఫోటోను, ‘‘హ్యాప్పీ బర్త్‌డే టు మీ 55’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోను అప్‌లోడ్ చేసినందుకు మిలింద్‌పై అశ్లీలతకు కేసు నమోదయ్యింది. సమాచార సాంకేతిక చట్టంలోని ఇతర సంబంధిత విభాగాలతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీలత) కింద కేసు నమోదు చేసినట్లు దక్షిణ గోవా పోలీస్ సూపరిండెంట్ పంకజ్ కుమార్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌తో చెప్పారు.
ఇటీవల ఇదే తరహాలో మోడల్, నటి పూనం పాండే కూడా అభ్యంతరకరమైన వీడియో చిత్రీకరించినందుకు, ఆమెను, ఆమె భర్త సామ్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై వేల రూపాయల బెయిల్ బాండ్ విధించారు. కెనకోనా న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, అన్ని నగ్న చిత్రాలను అశ్లీలంగా పరిగణించలేమని అన్నారు. ‘‘ఇలాంటి ప్రాతినిథ్యం కలిగిన కళను ప్రదర్శించేటప్పుడు దీన్నొక మినహాయింపుగా గమనించడం ముఖ్యం. చలన చిత్రాలను రూపొందించటమనేది ఒక కళాత్మక ప్రయోగం. వాస్తవాలు, పరిస్థితులను బట్టి నగ్నత్వం అంతా అశ్లీలమని ఒక నిర్ణయానికి రాకూడదని’’ ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment