ముగమూడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శాండిల్‌వుడ్ బ్యూటీ పూజాహెగ్డే. ఆ చిత్రం ఆమెను నిరాశపరిచినా, ఆ తరువాత టాలీవుడ్ స్వాగతం పలకడంతోపాటు అందలం ఎక్కించింది. కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఆమెను వరుస అపజయాలు వెంటాడుతున్నాయి. మధ్యలో బాలీవుడ్‌కు వెళ్లినా అక్కడ కూడా ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది. అదేవిధంగా పదేళ్ల తర్వాత కోలీవుడ్‌లో రెండోసారి తన అదృష్టాన్ని బీస్ట్ చిత్రం ద్వారా పరీక్షించుకునే ప్రయత్నం చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబుతో నటిస్తున్న చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఇకపోతే సినిమా ఈమెకు మంచి పాఠాలే నేర్పినట్టుంది. కొంచెం నమ్మకాన్ని, మరికొంత వేదాంతాన్ని జోడించి, నిరాశను కప్పిపుచ్చుకునే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ మన చేతిలో ఉండదు. మనం చేసే పనికి ఎలాంటి ఫలితం వచ్చినా అంగీకరించక తప్పదు. వ్యక్తిగతంగా అయినా సినిమా విషయంలో ఆయినా కొన్ని నిర్ణయాలు కచ్చితంగా మన చేతిలో ఉండవు అని పేర్కొంది.
తను నటించిన కొన్ని చిత్రాలు విజయం సాధించలేదని అడుగుతున్నారని, ఏమైనా తప్పులు జరిగితే వాటిని పరిశీలించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని చెప్పింది. తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే తానీ స్థాయికి ఎదిగానంది. కొన్ని సమయాల్లో మనం ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు, అలాగని మనం తీసుకున్న నిర్ణయాలు తప్పని భావించకూడదని ఆమె పేర్కొంది. మనం తీసుకునే నిర్ణయాల కారణంగా ఏదో ఒక రోజు మన జీవితం పరిపూర్ణంగా మారి మంచి జరుగుతుందనే నమ్మకం తనకుందనే ఆశాభావాన్ని పూజాహెగ్డే వ్యక్తం చేసింది.
చదవండి: నిర్మాతగా మారడానికి ఇదే సరైన కథ
Comments
Please login to add a commentAdd a comment