టైటిల్: పొట్టేల్
నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్‌మీట్‌లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్‌లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్‌ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్‌ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది.
పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్‌ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.
పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు.
అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్‌లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
- రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment