చిన్న పాత్రల నుంచి కామెడీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు కథానాయడిగా మారిన నటుడు యోగిబాబు. అయితే తన ప్రవర్తనతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో కొందరు దర్శక-నిర్మాతలు ఈయనపై గుర్రుగా ఉన్నారు. తాజాగా మరో నిర్మాత యోగిబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతాకంపై గిన్నిస్ కిషోర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి నిర్మించిన చిత్రం దాదా. ఇందులో యోగి బాబు, నితిన్ సత్య కథానాయకులుగా, గాయత్రి నాయకిగా నటించారు.
మనోబాలా, నాజర్, సింగం ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్‌హెచ్ అశోక్ చాయాగ్రహణను, కార్తీక్ కృష్ణ సంగీతాన్ని అందించారు. వినోదమే ప్రధానంగా రూపొందించిన దాదా చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిత్ర దర్శక నిర్మాత గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ.. ఇందులో నటించిన యోగిబాబు చాలా ఇబ్బందులు పెట్టారని, చిత్రంలో తాను నటించింది 4 సన్నివేశాల్లోనే అంటూ, చిత్రాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని బయ్యర్లకు ఫోన్ చేసి మరి దుష్పచారం చేసి తన వ్యాపారానికి దెబ్బ కొట్టారని ఆరోపించారు.
యోగిబాబు 4 సన్నివేశాలు నటించారో, 40 సన్నివేశాలు నటించారో చిత్రం చూసిన తర్వాత మీరే చెప్పాలన్నారు. అదే విధంగా చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తన తదుపరి చిత్రంలో నటించడానికి యోగిబాబుకు అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయితే ఇప్పుడు చిత్రంలో నటించడానికి ఆయన నిరాకరిస్తున్నారని, దీనిపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన చిత్రంలో నటించకపోతే మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యోగిబాబు తీరును తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment