
హీరో రవితేజ లేటెస్ట్ మూవీ 'ఈగల్'. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. విడుదల దగ్గర పడటంతో సినిమా ఎలా ఉండబోతుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్.. 'ఈగల్' గురించి, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ మహేశ్, వెంకటేశ్, నాగార్జున చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో 'ఈగల్' పోటీ నుంచి తప్పుకొంది. తెలుగు నిర్మాతల మండలి సోలో డేట్ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 9కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా క్లైమాక్స్ వేరే లెవల్ ఉండబోతుందని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!)
'ఈగల్' సినిమాలోని చివరి 40 నిమిషాలు ఎక్స్‌ప్లోజివ్‌గా ఉంటుందని, లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటుందని.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరని నిర్మాత విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన చెప్పినట్లు క్లైమాక్స్ ఉంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.
'ఈగల్' సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్ కీలకపాత్ర పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: 'పుష్ప' సినిమాకు మూడో పార్ట్? వర్కౌట్ అయ్యే పనేనా?)