టైటిల్ : రాధేశ్యామ్
నటీనటులు : ప్రభాస్,పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు
నిర్మాణ సంస్థ : గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్
నిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ ప్రమోద్ ప్రసీదా
దర్శకత్వం : కె. రాధాకృష్ణ
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్(తెలుగు,తమిళ, కన్నడ,మళయాళం)
నేపథ్య సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది : మార్చి 11,2022
బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘రాధేశ్యామ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
‘రాధేశ్యామ్’ కథేంటంటే..
రాధేశ్యామ్ కథంతా 1976 ప్రాంతంలో సాగుతుంది. విక్రమాదిత్య(ప్రభాస్) ఓ గొప్ప జ్యోతిష్కుడు. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పి.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లిపోతాడు. తన చేతిలో ప్రేమ రేఖలు లేవని, లవ్‌ని కాకుండా ఫ్లటేషన్‌షిప్‌ని నమ్ముకుంటాడు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఎంజాయ్ చేసే విక్రమాదిత్య.. డాక్టర్ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ తన చేతిలో లవ్ లైన్స్ లేవని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక పోతాడు. మరోవైపు ప్రేరణ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు. కానీ తాను జీవితాంతం బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? విధిని ఎదురించి తన ప్రేమని విక్రమాదిత్య గెలిపించుకోగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే..
మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి. ఇటలీలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది. ప్రభాస్ గత సినిమాల మాదిరి ఫైట్ సీన్స్, మాస్ సాంగ్స్ గానీ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథంతా హీరో, హీరోయిన్ల చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రలకు అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, జగపతిబాబు, జయరాం,మురళిశర్మ లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ.. వారంతా కథలో ఇలా వచ్చి అలా వెళ్లినట్లు అనిపిస్తుంది.
ప్రేమ కథకు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. ఈ సినిమాలో ఆ కెమెస్ట్రీ వర్కౌట్ అయినా.. అందుకు తగినట్లుగా బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. యూరప్ అందాలపైనే దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టినట్లు అనిపిస్తుంది. ట్రైన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డెత్ ప్రాక్టీస్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ ఆసక్తిని సినిమా ఎండింగ్ వరకు కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓడ సీన్.. పలు ఇంటర్యూల్లో చిత్ర యూనిట్ చెప్పినట్లుగా మెస్మరైస్ చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న ప్రభాస్.. ఇలాంటి కథను ఒప్పుకొని, చేయడం నిజంగా ఓ ప్రయోగమే. కానీ అది అంతగా ఫలించలేదు.
ఎవరెలా చేశారంటే..
పేరుమోసిన జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. మాస్ ఇమేజ్‌ని ఉన్న ప్రభాస్.. ఈ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించాడు. ఇక డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. వీరిద్దరి జోడి తెరపై అందంగా కనిపించింది. విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రంలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించింది. కానీ ఆమె పాత్రకు అంతగా స్క్రీన్ స్పెస్ లేదు. అలాగే హీరోయిన్ పెదనాన్నగా సచిల్ ఖేడ్‌కర్, ఓడ కెప్టెన్‌గా జయరాం, బిజినెస్ మ్యాన్‌గా జగపతిబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రపంచాన్ని కళ్లముందు సృష్టించాడు.అలాగే కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అవసరానికి మించి విఎఫ్ఎక్స్ ను ఉపయోగించుకోవడంతో ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా మారిపోయింది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం(సౌత్ వర్షన్) ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. తమన్ నేపథ్య సంగీతం బాగుంది.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment