
Rajinikanth Biopic: పాన్ ఇండియా రేంజ్‌లో రజనీకాంత్ బయోపిక్
May 3 2024 2:43 PM | Updated on May 3 2024 3:18 PM

సెలబ్రిటీల జీవిత చరిత్రలు వెండితెరకెక్కడం సహజమే. అలా ఇప్పటికే రాజకీయ రంగంలో మహాత్మాగాంధీ, కామరాజర్, జయలలిత,వైఎస్‌ఆర్.. క్రీడా రంగంలో మహేంద్రసింగ్ ధోని వంటి పలువురు బయోపిక్స్ సినిమాగా రూపొందాయి. ఇందిరాగాంధీ, సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
కర్ణాటకకు చెందిన శివాజీరావ్ గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్సు కండెక్టర్ ఇవాళ దక్షిణ భారత సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ జీవిత పయనం చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కాగా ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా వార్త. హిందీలో పలు చిత్రాలను నిర్మించిన సుజిత్ నడియద్వాలా నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈయన ఇటీవల నటుడు రజనీకాంత్‌ను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆయన అనుమతితో ఈ స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ? రజనీకాంత్‌గా ఎవరు నటిస్తారూ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుందన్న ప్రచారం మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఇది హిందీలోనే రూపొందుతుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రానుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Advertisement
Advertisement