
Rakeysh Omprakash Mehra: జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కొన్నిసార్లు ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలే విజయానికి నాందిగా మారుతాయి. కానీ కొందరు మాత్రం ఓటమికి కుంగిపోయి అక్కడే ఆగిపోతారు. దాన్నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడతారు. దర్శకుడు రాఖేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కూడా జీవితంలో ఇలాంటి స్థితిని దాటి వచ్చినవాడే. అతడు తెరకెక్కించిన 'ఢిల్లీ 6' చిత్రం 2009లో రిలీజైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఆ సమయంలో అతడు ఓరకంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తన ఆటోబయోగ్రఫీ 'ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్'లో ప్రస్తావించాడు. 'ఢిల్లీ 6' సినిమా ఫ్లాప్ అవడంతో తను ఎంతగానో బాధపడ్డానన్నాడు. థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు మూవీ ఇంకా పూర్తవకముందే ప్రేక్షకులు విసురుగా బయటకు వెళ్లిపోయేవారని తెలిపాడు. అంతేకాక రానురానూ ఏకంగా చంపుతామని బెదిరింపులు కూడా మొదలవడంతో ఎవరికీ తెలియని చీకటి ప్రదేశంలోకి వెళ్లిపోయి తలదాచుకున్నానని గుర్తు చేసుకున్నాడు.
ఈ బాధను, ఫెయిల్యూర్‌ను భరించలేక తాగుడుకు బానిసయ్యానని వెల్లడించాడు. ఒకానొక సమయంలో పీకల్దాకా తాగి చనిపోవాలనుకున్నానని, శాశ్వత నిద్రలోకి జారుకోవాలని చూశానన్నాడు. తన ప్రవర్తనతో భార్య భారతి, కూతురు భైరవిని క్షోభ పెట్టానని, మరోపక్క కొడుకు వేదాంత్‌తో దూరం కూడా పెరిగిందని బాధపడ్డాడు. ఇలా తాను ప్రేమించేవాళ్లందనీ నిర్లక్ష్యం చేసి వారిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఈ దర్శకుడు తర్వాతి కాలంలో 'రంగ్‌దే బసంతి', 'భాగ్ మిల్కా భాగ్' వంటి హిట్ చిత్రాలను అందించాడు. ఇటీవలే ఓటీటీలో వచ్చిన 'తుఫాన్' చిత్రంతో మరోసారి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment