సంధ్య థియేటర్‌ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ | Ram Gopal Varma Comments On Sandhya Theatre Incident Of Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్‌ వంటి ఘటనలు గతంలో జరగలేదా..? ఈ నిర్ణయం ఎందుకు: ఆర్జీవీ

Published Mon, Dec 9 2024 12:19 PM | Last Updated on Mon, Dec 9 2024 12:29 PM

Ram Gopal Varma Comments On Sandhya Theatre Incident Of Pushpa 2 Movie

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే,  రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్‌ఫిట్‌ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్‌ గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటన విషయంలో అల్లు అర్జున్‌ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.  ఈ కారణంతో బెనిఫిట్‌ షోలను బ్యాన్‌ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.

'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్‌ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే,  తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత,  ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ  సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.

బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్‌ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్‌ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్‌కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.

సినిమా నటులు థియేటర్‌లను సందర్శించడం అనేది కొన్ని  సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్‌కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement