ఆల్‌రౌండర్ రవి శాస్త్రి.. సినిమా హీరోకున్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు!
అతని ఆటతోపాటు అపియరెన్స్‌నూ ఆరాధించారు అమ్మాయిలు!
అతను బాలీవుడ్ నటి అమృతా సింగ్‌ను ప్రేమించాడు.. ఆమె కూడా రవి శాస్త్రి తోడును కోరుకుంది..
కానీ ఆ ప్రేమ .. పెళ్లి ఆహ్వానాన్ని పంపలేదు..ఆ బ్రేకప్‌కు కారణమేంటో తెలుసుకోవాలంటే ఇంకో బ్రేకప్ దగ్గర మొదలైన ఈ లవ్‌స్టోరీ చదవాలి..
పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి తనతో ప్రేమ నటించిన సన్నీ డియోల్ మోసాన్ని తట్టుకోలేకపోయింది అమృతా సింగ్. కాస్త కటువుగానే అతనితో తెగతెంపులు చేసేసుకుంది. ఆ బాధను, దిగులును మరచిపోవడానికి కెరీర్ మీద ఏకాగ్రతను పెంచుకుంది. ఏ కాస్త వీలు దొరికినా స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లి సేద తీరేది. అలాంటి ఓ సందర్భంలోనే రవి శాస్త్రి పరిచయమయ్యాడు. అప్పటికి రవి శాస్త్రి గురించి కాస్తయినా అమృతాకు తెలుసు కానీ.. అమృతా గురించి ఆ క్రికెటర్‌కు ఏమీ తెలీదు. అయినా అమృతా నచ్చింది అతనికి.. తొలి చూపులోనే. మొదటి పరిచయంలోనే ఇద్దరూ చాలా సన్నిహితులైపోయారు. టెలిఫోన్ నంబర్లూ ఇచ్చిపుచ్చుకున్నారు. తెల్లవారి నుంచి టెలిఫోన్ సంభాషణలూ స్టార్ట్ చేశారు.
తీరిక వేళల్లో..
అమృతా సింగ్ నటించిన సినిమాలు చూడకపోయినా.. ఆమె షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడు రవిశాస్త్రి. అమృతా అంతే.. క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా రవిశాస్త్రి కోసం అతనితో కలసి క్రికెట్ టూరింగ్ చేసింది. కాఫీ డేట్‌లు, డిన్నర్ మీట్‌లు సాధారణమయ్యాయి. వీళ్ల తీరుకి అది ప్రేమే అని గ్రహించిన మీడియా కథనాలు రాయసాగింది. అవునని కానీ.. కాదని కానీ కామెంట్ చేయలేదు ఆ జంట. చూసీ చూడనట్టే ఉండిపోయింది.
కొన్నాళ్లకు జంటగా ‘సినీ బ్లిట్జ్’ మ్యాగజైన్ కవర్ మీద కనిపించింది ఆ జంట.. తమ మధ్య ప్రేమానుబంధం నిజమే అని ప్రకటిస్తూ! ‘చూశారా మేం చెప్పింది నిజమే’ అంటూ పేజ్‌త్రీ కాలమ్స్ థమ్స్ అప్ చేశాయి. నిశ్చితార్థం కూడా అయిపోయిందని చెప్పాయి. దీని గురించి కూడా మీడియా రాసింది.. ‘న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో రవిశాస్త్రి.. అమృతాకు ఉంగరం తొడిగాడు.. బహుశా అది ఎంగేజ్‌మెంట్ రింగ్ కావచ్చు’ అని. ఎవరు చెబితేనేం .. ఆ ఇద్దరి ప్రేమ నిజం.. వాళ్లిద్దరూ ఒక్కింటివాళ్లవ్వబోతున్నది మాత్రం అబద్ధంగా తేలింది.
ఎందుకలా?
వాళ్ల నిశ్చితార్థం సమయానికి ఇంకా చెప్పాలంటే ఆ జంట ఇష్క్‌లో ఈదుతున్నప్పటికీ వాళ్ల వాళ్ల కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. అమృతా క్యాలెండర్ ఖాళీ లేనంత బిజీ. అదే రవి శాస్త్రికి ఇబ్బంది అనిపించింది. పెళ్లి కానంత వరకు అమ్మాయిలకు ఉద్యోగాలు ఉండొచ్చు కానీ పెళ్లయ్యాక ఇల్లాలికి ఇల్లే ప్రపంచం కావాలనే స్థిరమైన అభిప్రాయం అతనిది. అడిగాడు అమృతాను సినిమాలు మానేయమని. అప్పుడప్పుడే సక్సెస్‌ను.. స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఆమెకు అతని డిమాండ్ సమంజసమనిపించలేదు. అందుకే ‘సారీ’ అంది. అతనూ ‘సారీ’ అన్నాడు పెళ్లికి. అలా బ్రేక్ అయిపోయింది ఆ బంధం.
ఎవరి దారిలో వారు..
అమృతాను కాదనుకున్నాక 1990లో రీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు రవి శాస్త్రి. సరిగ్గా ఏడాదికి అంటే 1991లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లాలైంది అమృతా సింగ్. అయితే తమ పెళ్లయిన 22 ఏళ్లకు రీతూకు విడాకులిచ్చాడు రవి శాస్త్రి. తమ పెళ్లయిన పదమూడేళ్లకు అంటే 2004లో సైఫ్ అలీ ఖాన్‌తో వివాహబంధాన్ని రద్దు చేసుకుంది అమృతా సింగ్.
రీతూ విడిపోయాక.. బాలీవుడ్ నటి.. లంచ్ బాక్స్ ఫేమ్ నిమ్రత్ కౌర్‌తో ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియా మాట. దాన్నీ నిజంగా సమర్థించలేదు.. వదంతిగానూ కొట్టి పారేయలేదు ఆ ఇద్దరూ!
జీవిత భాగస్వామి విషయంలో నాక్కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాస్త పురుషాహంకారిని కూడా. పెళ్లయ్యాక భార్యకు ఇల్లే లోకం కావాలని బలంగా నమ్ముతాను. అందుకే సినీ నటిని నా భార్యగా నేనాడూ ఊహించలేదు. – రవి శాస్త్రి
క్షణం తీరికలేకుండా కెరీర్ సాగుతున్న టైమ్‌లో దాన్ని వదులుకునేందుకు నేనూ సిద్ధపడలేదు. కొన్నాళ్లు వేచిచూస్తే తెలిసేది.. భార్యగా.. తల్లిగా నేను సిద్ధమో..కాదో! – అమృతా సింగ్
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment