
‘‘నా సినిమాల్లో జోష్ ఎప్పుడూ ఉంటుంది. సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి.. సినిమా బాగాలేదనుకోండి ఏదీ బాగుండదు. నా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒక్కటే జోష్ ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు ఉండదు’’ అని హీరో రవితేజ అన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవితేజ చెప్పిన విశేషాలు...
► కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 50శాతం సీట్ల సామర్థ్యంతో సినిమాల విడుదలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో వందశాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతులు ఇస్తున్నారని తెలిసింది.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇస్తే మంచిదే. ప్రేక్షకులందర్నీ నేను కోరుకునేది ఒక్కటే. దయచేసి సినిమాకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడంతో పాటు ఓ చిన్న శానిటైజర్ తీసుకెళితే అందరూ సేఫ్‌గా ఉంటారు. మాస్కులు ధరించాలని కోరుతున్నా. ఫ్యాన్స్ ఉంటారు.. అరచి ఎంజాయ్ చేయాలనుకుంటారు.. మాస్కులు వేసుకునే అరవాలని కోరుతున్నాను(నవ్వుతూ).
► కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయడం భయంగా అనిపించలేదు. ‘క్రాక్’ కోసం రెండు సెట్ సాంగ్స్ చేశాం. 300మందితో ఓ పాట తీశాం. దేవుడి దయ వల్ల ఒక్కరికీ కోవిడ్ సోకలేదు. దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసుకోవచ్చనే ధైర్యం వచ్చింది.
► వాస్తవ సంఘటనల స్ఫూర్తితో చేసిన ‘క్రాక్’ సినిమాలో ప్రేక్షకుల్ని అలరించే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంది. పక్కా కమర్షియల్ మాస్ ఫిల్మ్.. పాటలు కూడా బాగున్నాయి. ఇదొక ఫుల్ మీల్స్ సినిమా.. సంతోషంగా చూస్తారు. సినిమా బాగా వచ్చింది. ఇందులో పోలీస్ పాత్రను నేను బాగా ఎంజాయ్ చేశాను. ఔట్‌పుట్ పరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ‘విక్రమార్కుడు’ చిత్రంలో విక్రమ్‌సింగ్ రాథోడ్ పాత్ర క్రెడిట్ రాజమౌళిగారికే చెందుతుంది. ఆ సినిమా తర్వాత పోలీస్ పాత్రలంటే నాకు మంచి ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ‘విక్రమార్కుడు’ నా పాత్రని ‘క్రాక్’ పాత్రని పోల్చి చూడొద్దు.. దేని స్థాయి దానిదే.
► పూరి జగన్నాథ్‌గారి తర్వాత ఎక్కువ సినిమాలు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి ప్రత్యేకించి కారణం లేదు.. అలా కుదిరిందంతే.. అనుకుంటే జరగవు కూడా. నా గత చిత్రాలు ‘అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా’ సరిగ్గా ఆడలేదంటే వాటిల్లో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలేవో మిస్ అయ్యాయి. 2020 గురించి మనం అస్సలు ఆలోచించొద్దు.. ముందుకెళ్దాం.
► ఈ లాక్‌డౌన్ అద్భుతంగా, సంతోషంగా గడిచింది. వర్కవుట్స్ చేసుకున్నా.. బోలెడన్ని సినిమాలు చూశా.. లాక్‌డౌన్ అనేది బయట ఎక్కువగా తిరిగే వారికి సమస్యగా మారింది. నేను బయట ఎక్కువగా తిరగను. కాబట్టి నాకు ఏ ఇబ్బందీ అనిపించలేదు. ఒక్క క్షణం కూడా బోర్ ఫీలవలేదు. నేనెప్పుడూ ఫ్యామిలీ మేనే. ఈ లాక్‌డౌన్‌లో ఇంకా ఎక్కువగా ఇంట్లో కుటుంబంతో గడిపాను. అన్నీ స్తంభించిపోతే ఎలా ఉంటుంది? అనే విషయాలు ఈ లాక్‌డౌన్‌లో తెలిశాయి. ఇది ఓ రకంగా మంచిదే. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది.
► మా అబ్బాయి మహాధన్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. వాడు సినిమాలు చేయడానికి చాలా టైమ్ ఉంది. భవిష్యత్‌లో వాడికి ఏది ఇష్టమైతే అది చేస్తాడు. ఏ తల్లితండ్రులైనా తమ పిల్లల్ని వారికి ఇష్టం వచ్చింది చేయనివ్వాలి. టైమ్ వచ్చినప్పుడు దర్శకత్వం చేస్తా. ఇప్పుడైతే సమయం లేదు.
Comments
Please login to add a commentAdd a comment