
‘‘రాబిన్ హుడ్’లో మంచి వినోదం ఉంది. ఓ హార్ట్ టచింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఆడియన్స్ కొత్త అనుభూతి పొందుతారు’’ అని నితిన్ అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నాది చాలా ఇంటలెక్చువల్ రోల్. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్ట్‌లు, షాక్‌లు ఆడియన్స్‌కు ఫ్రెష్‌గా అనిపిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఫన్ ఉన్నప్పటికీ కథలో ఆత్మ మాత్రం ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది’’ అని తెలిపారు వెంకీ కుడుముల.
‘‘ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో రిలీజ్ డేట్ ఆశించకూడదు. మేం వస్తున్నామన్నప్పుడు మా ఒక్క సినిమానే ఉంది. కానీ ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మనం మూవీ చేస్తున్నప్పుడే పోటీ తప్పదనే మైండ్ సెట్‌తో దిగాలని భావిస్తా. ఇక వచ్చే ఏడాది మా బ్యానర్‌కు చాలా ముఖ్యం. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్– బుచ్చిబాబు, ప్రభాస్–హను రాఘవపూడి, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రాహుల్ సంకృత్యాన్–విజయ్ దేవరకొండ మూవీ, పవన్ కల్యాణ్ సినిమా... ఈ అరడజను సినిమాలపై మా ప్రస్తుత ఫోకస్ ఉంది. ఇక తమిళ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మా బేనర్లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు.