‘‘ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు నేను చేయను’’ అంటున్నారు హీరోయిన్ సమంత. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్స్ వెర్షన్స్ . ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’ సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే వేదికపై సినిమాల్లో మహిళల పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే ఎన్నో విషయాల గురించి ఆలోచించి, పాత్రలను ఎంచుకుంటాను. ప్రస్తుతం సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా.
సినిమాల్లో కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు నేను దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే ప్రకటనల విషయంలోనూ ఆలోచిస్తాను. ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర నాది. యాక్షన్స్ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేశా. కానీ, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చాన్స్‌ల కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా కొన్నింటినే ఎంచుకుంటున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు, నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది’’ అని సమంత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment