నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్‌లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్‌సామియిన్ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్.
విజయ్.. నిరాడంబర వ్యక్తి
నల్లుసామి పతాకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు.
అప్పుడు ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్ ఆంటోని
హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్ చిత్రంలో విజయ్ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్ టైటిల్ దర్శకుడు సుశీంద్రన్ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment