ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమా అన్నది వినోద సాధనమన్న విషయం మనందరికీ తెలుసు. మన కథలనే మనం వెండితెర మీద చూసుకుని మనమే ముచ్చటపడతాం. ఓ రకంగా చెప్పాలంటే సినిమా అన్నది మన జీవితాలకు అద్దం లాంటిదన్నమాట. చాలా సినిమాలు ఆనందాన్నిస్తే కొన్ని సినిమాలు మాత్రం మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఈ కోవలోకి చెందినదే. నందితా రాయ్, ముఖర్జీ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ సున్నిత అంశానికి మూలాధారం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన పరేష్ రావెల్ ఈ సినిమాలో గురూజీగా పిలవబడే ప్రధాన పాత్ర పోషించారు.
కథాంశానికొస్తే... ఏడేళ్ల యమన్ శాస్త్రి వారం మొత్తం తన నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటూ వారాంతంలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు. కొంత కాలానికి యమన్ శాస్త్రి తల్లిదండ్రులకు ఈ విషయం రుచించదు. తమ బిడ్డ మొత్తానికే తమ దగ్గర ఉండాలని మలర్ శాస్త్రి తన తండ్రైన మనోహర్ శాస్త్రిని ఉరఫ్ గురూజీని అడుగుతాడు.
దానికి ఆయన ససేమిరా అంటూ వారాంతంలో మాత్రమే బిడ్డను చూసుకునే తీరిక కలిగిన మీ దగ్గర యమన్ సరిగా ఇమడలేడు అని నిక్కచ్చిగా చెబుతాడు. అయినా యమన్ విషయంలో మలర్ పట్టుబడతాడు. ఇక చేసేది లేక గురూజీ తన మనవడి కోసం తన కొడుకు, కోడలిపై కోర్టులో కేసు వేస్తాడు. ఈ కేసులో మనవడి మీద తాత మమకారం గెలుస్తుందా లేక తల్లిదండ్రుల అనురాగం గెలుస్తుందా? అన్నది ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమాలోనే చూడాలి.
ఇది నేటి తరానికి ఓ చక్కటి లైబ్రరీ మూవీ అని చెప్పాలి. ఉరుకుల పరుగుల మన నిత్య జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి కూడా తల దించుకుని మొబైల్ స్క్రీన్‌లోనే చూస్తున్నాము తప్ప తల ఎత్తి సాటి వ్యక్తులను చూడడం కూడా లేదు. అందుకే ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమా మనందరికీ ఓ మేలుకొలుపులాంటిది, మనమందరమూ తెలుసుకోవాల్సిన విషయం చాలానే ఉంది ఈ సినిమాలో. రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేడు రెండుగంటలు వెచ్చించి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment