అదితి సుధీర్ పోహంకర్.. ఇప్పుడు వెబ్ వీక్షకులు గూగుల్‌లో క్రేజీగా సెర్చ్ చేస్తున్న పేరు. కారణం.. ఆమె నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘షి (సీజన్ 1 అండ్ 2)’. అందులో అదితిది పోలీస్ ఇన్‌ఫార్మర్ పాత్ర. ఆమె నటనకు ఓటీటీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ ఆదరణే ఇక్కడ అదితి గురించి రాసేలా చేసింది.
అదితి పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. శోభ పోహంకర్, సుధీర్ పోహంకర్. ఇద్దరూ అథ్లెట్సే. శోభ.. జాతీయ స్థాయి హాకీ ప్లేయర్. సుధీర్.. మారథాన్ రన్నర్. అదితికి ఓ సోదరి కూడా ఉంది. పేరు.. నివేదితా పోహంకర్. పృథ్వి థియేటర్‌లో రైటర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త.. అదితి బావ.. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత మకరంద్ దేశ్‌పాండే. నటిగా అదితిని తీర్చిదిద్దింది అతనే. అదితి నానమ్మ సుశీల తాయి పోహంకర్ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. బాబాయి అజయ్ పోహంకర్ కూడా గాయకుడే.
అదితికి అమ్మానాన్నల క్రీడా వారసత్వం.. నానమ్మ, బాబాయిల కళా వారసత్వం రెండూ వచ్చాయి. బడిలో ఉన్నప్పుడు రాష్ట్ర (మహారాష్ట్ర) స్థాయి అథ్లెట్‌గా రాణించింది. నటనా కళ గురించి తెలిసిందే. థియేటర్ ఆర్టిస్ట్‌గా తన అభినయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ‘లవ్.. సెక్స్.. ధోకా’తో సినీరంగ (బాలీవుడ్) ప్రవేశం చేసింది. ఆ సినిమాలో పోషించింది చిన్న పాత్రే అయినా కనబర్చిన నటన మాత్రం ఘనం. దాంతోనే ఆమెకు ‘లయ్ భారీ’ అనే మరాఠీ చిత్రంలో హీరోయిన్‌గా చాన్స్ వచ్చింది. అది ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. తమిళ చిత్రసీమకూ ఆమెను ఇంట్రడ్యూస్ చేసింది.
విజయాలు యాక్టింగ్ షెడ్యూల్‌ను బిజీ చేస్తున్నా.. అదితి మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. అందులో భాగంగానే వెబ్ తెర ఇచ్చిన అవకాశాన్ని అందుకుంది. ‘షి’ వెబ్ సిరీస్‌తో దేశమంతా పాపులర్ అయింది. ‘ఆశ్రమ్’ అనే మరో వెబ్ సిరీస్‌లోనూ నటించి.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'నటన.. నా ప్యాషన్. అందుకే నా అభినయాన్ని ప్రదర్శించే వేదిక ఏంటీ అని చూడను. అది థియేటర్ అయినా.. సినిమా అయినా.. ఓటీటీ అయినా.. నేను చేయబోయే రోల్.. దాని ఇంపాక్ట్ ఏంటీ అనే చూస్తాను' అని అదితి పోహంకర్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment