Happy Birthday Sid Sriram: పొగడ్త అందరికీ చేత కాదు. అందరి గొంతు అందుకు నప్పదు. స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. మే 19 సిద్ శ్రీరామ్ జన్మదినం. 32లోకి ఎంటర్ అవుతున్నాడు.ఆ గొంతు పొగిడిన స్త్రీ సౌందర్యపు పాటలు ఇవి.
‘ముల్లో పువ్వో పోయే దారిదైనా
నిన్నే నమ్మి వచ్చానే
అడవి గుర్రమంటి ఒక గుర్రెపిల్లలాగా
నీ వెంటే వస్తున్నానే
యాడికే... యాడికే
తీసుకెళ్తావే నీతో పాటే’....
మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం సిద్ శ్రీరామ్ మొదటిసారి ప్రియురాలిని కీర్తిస్తూ ఈ పాట ఏ ముహూర్తాన పాడాడోగాని తెలుగులో అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి సినిమాల్లో సిద్ గొంతును హీరోలు అరువు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. సిద్ గొంతుతో ‘నీ బాగున్నావు... ముచ్చటగా ఉన్నావు.. నువ్వు నవ్వితే బుగ్గన సొట్ట పడుతుంది’ వంటి మామూలు మాటలు మాట్లాడినా ఆ హీరోయిన్ తప్పక లవ్‌ను యాక్సెప్ట్ చేసే మెస్మరిజమ్ అతని గొంతులో ఉంది. అది సినిమాకు ప్లస్ అవుతోంది. శంకర్ కూడా ఇది కనిపెట్టి ‘ఐ’ కోసం సిద్ చేత పాడించాడు. ‘నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా’ పాట బయట హిట్. చూడటానికి కాదు. వినడానికి.
‘హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే’... అని ‘సాహసం శ్వాసగా సాగిపో’లో సిద్ శ్రీరామ్ ‘వెళ్లిపోమాకే’ పాటలో అంటాడు. ఆ లైన్స్‌తో హీరోయిన్ హీరో నాగచైతన్య ప్రేమలో పడుతుంది. ప్రేమను చెప్పడానికి కాదు ఆ ప్రేమలో దూరం వస్తే దాని లోతును చెప్పడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు బాగా నప్పుతుంది. ‘అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ’ అని ‘నిన్ను కోరి’లో సిద్ పాడిన పాట అలాంటి స్థితిలో ఉన్న ప్రేమికులను తాకుతుంది.
ఇక ‘గీత గోవిందం’లోని ‘ఇంకెం ఇంకెం ఇంకేం కావాలే’ పాటతో సిద్ తెలుగువారి ఇంటింటి గాయకుడు అయ్యాడు. ‘నీ ఎదుట నిలబడు చనువే వీసా... అందుకుని గగనపు కొనలే చూసా’ అని అమాయకంగా పాడుతుంటే రష్మికా మందన్నా ఏంటి మందికా రష్మన్నా కూడా ఫిదా కాక తప్పదు కదా. అదే వరుసలో ‘టాక్సీ వాలా’లో ‘మాటే వినదుగా వినదుగా’ కూడా విజయ్ దేవరకొండకు దక్కింది.
కళ్లను శ్లాఘించి హిట్ కొట్టినవాళ్లున్నారు. కాని సిద్ శ్రీరామ్ ‘అల వైకుంఠపురములో’ కాళ్లను శ్లాఘించి సూపర్‌హిట్ కొట్టాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నా కళ్లు’... ఒక ఊపు ఊపింది. ‘ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా’ అని సిద్ ఈ పాటలో అంటాడు. వినక ఊరుకోగలదా పూజా హేగ్డే. ఇక చిన్న సినిమాలకు ఒక్క పాటతో ప్రాణం పోయొచ్చు అని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటతో సిద్ చూపిస్తాడు. ‘నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే... నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే’... సిద్ మాత్రమే ఆ పదానికి ప్రాణవాయువు ఇవ్వగలడు.
కాని స్త్రీ గొప్పతనాన్ని నిజంగా వర్ణించడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు అవసరమవుతుంది. ‘వకీల్‌సాబ్’లో ‘మగువా మగువా’ పాటను సిద్ పాడాడు. ‘ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా... నీవు లేని జగతిలో దీపమే వెలుగునా’ అని ఆమె గొప్పను సిద్ నిర్ధారిస్తూ పాడతాడు. మగవ మెచ్చే పాటలు మరెన్నో సిద్ పాడాలి. మనం వినాలి. స్త్రీలు ముచ్చటపడుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్‌డే హృదయగాయకా.(నేడు సిద్ శ్రీరామ్ జన్మదినం)
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment