ఒక్కోసారి సినిమాతో పాటు అందులో నటించిన తారలు చిక్కుల్లో పడుతుంటారు. నటి సిద్ది ఇద్నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ది కేరళ స్టోరి. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రాజకీయ మంటలు రేపుతోంది. దేశంలో అధికార పార్టీ మద్దతుగా నిలిచినా, ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. కారణం కేరళలో జరిగిన యదార్ధ సంఘటన ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందడమే!
అదీ 32 వేల మందిని బలవంతంగా ఇస్లామిక్ మతస్తులుగా మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసినట్లు చూపడంతో చిత్రంపై ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఈ చిత్రంలో గీతాంజలి అనే ఒక ప్రధాన పాత్రలో సిద్ధి ఇద్నాని నటించింది. కేరళ స్టోరీ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో నటి సిద్ధి ఇద్నాని సినిమాలో తప్పుగా ఏం చూపించలేదే అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రం కాదని, అవగాహన కలిగించే సినిమా అని పేర్కొంది. ఇది ఏ మతాన్ని వ్యతిరేకించే చిత్రం కాదని, తీవ్రవాదాన్ని ఖండించే మూవీ అని స్పష్టం చేసింది. అలాంటి చిత్రంలో నటించడం బాధ్యతగా భావించానని పేర్కొంది. ఈ అమ్మడి వ్యాఖ్యలపై కొందరు మండి పడుతుండగా.. మరికొందరు మద్దతు ఇస్తున్నారు.
కాగా సిద్ధి ఇద్నానీ.. హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన వెందు తనిందది కాడు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. నటుడు హరీష్ కల్యాణ్‌కు జంటగా నటించిన నూరు కోడి వానవిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్యకు జంటగా ఖాదర్ భాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జంబలకిడి పంబ(2018), అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ప్రేమకథా చిత్రం 2 సినిమాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment