బాలు మాతో 'పాటే' | SP Balasubramanyam Special Journey With Hyderabad City | Sakshi
Sakshi News home page

బాలు మాతో 'పాటే'

Published Sat, Sep 26 2020 8:31 AM | Last Updated on Sat, Sep 26 2020 8:36 AM

SP Balasubramanyam Special Journey With Hyderabad City - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఆయన లేకున్నా.. మాతో ‘పాటే’.. అంటోంది.. నగర కళా సాంస్కృతిక రంగం... గాన గంధర్వునితో తమజ్ఞాపకాలు తలచుకుని కన్నీరు మున్నీరవుతోంది. నగరంలో ఆయన అడుగుపెట్టని ఆడిటోరియం లేదు. ఆయనగళం వినిపించని వేదిక లేదు. ఆయన భుజం తట్టి ప్రోత్సహించనిసాంస్కృతిక సంస్థ లేదు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరనే వార్త తెలిసి ఎందరో సాంస్కృతిక రంగ ప్రముఖులు స్పందించారిలా.. 

తొలి సంగీత విభావరి మాతోనే.. 
గానగంధర్వులు బాల సుబ్రహ్మణ్యంతో హైదరాబాద్‌లో తొలి సంగీత విభావరి 1975లో మేమే నిర్వహించాం. అప్పట్లో రవీంద్రభారతిని సినిమా ప్రోగ్రామ్‌లకి ఇచ్చేవారు కాదు.. అందుకని లిబర్టీ దగ్గర లేడీ హైదరీ క్లబ్‌లో పెట్టాం. తర్వాత అఖిల భారత స్థాయిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల పోటీలు పెడితే జడ్జిగా మహదేవన్‌ హాజరయ్యారు. ఆ పోటీ విజేతలకు రవీంద్రభారతిలో బహుమతులిచ్చాం. ఒక వికలాంగుడికి బహుమతి ఇవ్వాల్సి వస్తే బాలు అతడ్ని ఎత్తుకుని బహుమతి ఇచ్చారు. అలాగే  ఏ.ఎం. రాజా స్వర్ణకంకణం లలిత కళాతోరణంలో బాలుకు ఇచ్చాం.


ఆ స్వర్ణ కంకణానికి డబ్బులు ఎంత అయిందని అడిగి తెలుసుకుని ఆ మొత్తాన్ని వేగేశ్న ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న వికలాంగ స్కూల్‌కి ఇచ్చేశారు. అలాగే మా దివ్యాంగుల ఆశ్రమానికి ఆయన ప్రధాన పోషకుడిగా కూడా మారారు. కళా సంస్థలకు నిధుల సేకరణ ప్రోగ్రామ్స్‌లో ఆయనెప్పుడూ రెమ్యునరేషన్‌ తీసుకునేవారు కాదు. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద పెట్టిన మ్యూజిక్‌ అవార్డ్‌ బాలుకు ఇస్తే అందులో భాగంగా వచ్చిన రూ.లక్ష నగదును ఆయన తన పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి అందించారు. ఆ ట్రస్ట్‌ తరఫున పేద గాయనీ గాయకులకు ఆర్థిక చేయూత అందించేవారు.

ఆయనకు ఒకసారి వీణ బహుమతిగా ఇస్తే ఎవరో నిరుపేద అమ్మాయి వీణ నేర్చుకునే సరదా ఉందంటే ఆ వీణ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చేశారు. ఇలాంటివెన్నో ఆయన కళా పోషణకు గుర్తులు. ఆయన లేకపోవడం కళా సంస్థలకు తీరని లోటు. ఎవరు పిలిచినా వీలున్నంత వరకూ హాజరయ్యేవారు. మా ఇద్దరిది 45 ఏళ్ల అనుబంధం. మా ఇళ్లకు వచ్చేవారు. భోజనం చేసేవారు. పిల్లల్ని ఆడించేవారు. ఏదేమైనా నగరంలోని కళాసంస్థలు ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్టే.  – వంశీ రామరాజు 

మనసున్న పాట.. 
20ఏళ్లుగా ఎస్పీబాలుతో పరిచయం ఉంది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. నా ప్రతి పుస్తకం తొలి పాఠకుడు ఆయనే. నా ఫొటోగ్రఫీలన్నీ నచ్చేవి ఆయనకి. బాల సుబ్రహ్మణ్యంను నాకు రచయిత వెన్నెకంటి పరిచయం చేశారు. సంగమం సంస్థ పెట్టాక వందల కార్యక్రమాల ద్వారా ఆయనకు మరింత దగ్గరయ్యా. ఆయనలో మంచి గాయకుడు మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి కూడా ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో తెలిసింది. ఓ సారి సురభి నాటక సమాజానికి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. దీని కోసం బాలు చేత ఒక పాట పాడించి అప్పట్లో ఆయన రెమ్యునరేషన్‌ కింద  రూ.50 వేలు ఇచ్చాం.

ఆ కార్యక్రమానికి హాజరైన ఆయన సురభి వాళ్ల పేదరికం చూసి రూ.50 వేలు తిరిగిచ్చేశారు. అంతేకాదు మరో రూ.25 వేలు కూడా కలిపి వారికి ఇచ్చారు. ప్రముఖ గాయని జిక్కికి బ్రెస్ట్‌ కేన్సర్‌ చికిత్సకు ఆర్థిక సాయం చేద్దామని ఆయన్ని రమ్మని పిలిస్తే రాలేకపోయారు. అలాగే ఉడత సరోజినికి సాయం కోసం కూడా ఓ కార్యక్రమం పెడితే కూడా ఏదో అర్జంటు పని వల్ల రాలేనని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఆ కార్యక్రమాల రోజు గుర్తు పెట్టుకుని మరీ రెండు కార్యక్రమాలకూ చెరో రూ.25 వేల చొప్పున పంపించారు. మరో సందర్భంలో గాయని పి.సుశీల ట్రస్ట్‌ పెట్టి తొలి జాతీయ అవార్డు తన పేరు మీద జానకికి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలు మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌ పెడితే రవీంద్రభారతిలో పొద్దున్నే వచ్చి సౌండ్‌ సిస్టమ్‌ చెక్‌ చేసుకున్నాడు.

అది తనకు సరిగా లేదని తనకు అలవాటైన సౌండ్‌ సిస్టమ్‌కి మార్పించారు. అంతేకాదు ఆ సౌండ్‌ సిస్టమ్‌కి ఖర్చు కూడా తానే భరించారు. రెమ్యునరేషన్‌గా సుశీల రూ.50 వేలు ఇస్తే.. మంచి కార్యక్రమం.. నాకు రెమ్యునరేషన్‌ వద్దంటూ సున్నితంగా తిరిగిచ్చేశారు. 40ఏళ్ల పాటు వేల సినిమాలకు సితార్‌ ప్లే చేసిన మిట్టా జనార్దన్‌ అనే సితార విద్వాంసుడు బాలు తొలిపాట నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు.  ఆ కళాకారుడికి ఎవరూ ఏమీ చేయడం లేదు.. గుర్తింపు లేదు అంటూ బాధపడిన బాలు నన్ను పిలిచి అతడి గురించి ఏదైనా ప్రోగ్రామ్‌ పెట్టమన్నారు. అంతేకాదు స్పాన్సర్స్‌ని కూడా ఆయనే మాట్లాడి గతేడాది రవీంద్రభారతిలో ప్రోగ్రామ్‌ చేసి మిట్టా జనార్దన్‌ని గ్రాండ్‌గా సన్మానించారు. ఏదో శాలువా కప్పి వదిలేయకుండా రూ.లక్ష పెట్టి స్వర్ణకంకణం స్వయంగా కొని తొడిగారు. అంత గొప్ప మానవత్వం ఉన్న మనిషిని కోల్పోవడం కళా.. సాంస్కృతిక రంగానికి తీరని లోటే. – సంజయ్‌ కిషోర్, సినీ పరిశోధకుడు, సంగమం సంస్థ నిర్వాహకులు 

‘గాన గంధర్వ’ ఇచ్చే అదృష్టం దక్కింది.. 


ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరంటే వినడానికి చాలా బాధగా ఉంది. ఆయనతో ఉన్న 40 ఏళ్ల పరిచయంతో ఎన్నో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ కలిసి నిర్వహించడం నా అదృష్టం. బాలు స్ఫూర్తితో ఘంటసాల 24గంటలు కార్యక్రమం 95లో ప్రారంభించి ఇంకా రాష్ట్రం అంతా చేస్తూ వస్తున్నాం. బాలు జన్మస్థలం నాదీ నెల్లూరే. అక్కడ 24గంటల కార్యక్రమం పెట్టినప్పుడు సినారె చేతులమీదుగా ఘంటసాల సావిత్రమ్మ సమక్షంలో.. గాన గంధర్వ బిరుదు అధికారికంగా ఇచ్చాం. ఆయన తొలి పాట పాడి 45 ఏళ్లు అయిన సందర్భంగా 2011 డిసెంబరులో నగరంలోని లలిత కళాతోరణంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు సన్మానాలు వద్దు, టిక్కెట్లు వద్దు అలాగైతేనే వస్తా అన్నారు.

అయితే 3గంటల పాటు మీరే పాటలు పాడాలి అని అడిగితే.. సరేనని 28 పాటలు పాడారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. 2014లో విశ్వనాథ్‌కు సన్మానం చేసిన సందర్భంగా బాలు ఆయనకు పాటలాభిషేకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11, 12 తేదీల్లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఘంటసాల 24 గంటల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం వెళ్లారు. అలా ఆయన పాల్గొన్న ఆఖరి ప్రోగ్రాం, ఆఖరి ప్రసంగం సైతం మాకే దక్కింది. స్నేహశీలి ఆయన. ఏమయ్యా రఘరామా అని ప్రేమగా పిలిచేవాడు.. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్‌ పెట్టినా మాకు తొలుత గుర్తొచ్చే పేరు ఆయనదే. అలాంటి ప్రముఖుడ్ని కోల్పోవడం తీరని లోటు.
 – రఘురామ్, కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్‌ 

డాక్టరేట్‌తో సత్కరించిన తెలుగు వర్సిటీ
నాంపల్లి: గాన గంధర్వుడు, పద్మభూషణ్, డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసింది. 1998లో విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో ఎస్పీ బాలుకు డిలిట్‌ పురస్కారంతో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. బాలు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల చూపిన ఆదరణ మరువలేనిదని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ అన్నారు. తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని అందంగా పలికి తెలుగు భాషా సంస్కృతికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించిన భాషా ప్రియులుగా, సినీ సంగీత రంగంలో అపారమైన ప్రతిభావంతులుగా నిలిచారని అన్నారు. వారి స్థానం భారతీయ భాషల చలన చిత్రరంగంలో అజరామరంగా కొనసాగుతుందని కీర్తించారు. ఎస్పీ బాలు మృతి పట్ల వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిణి ఆచార్యరెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వి.సత్తిరెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ జె.అజయ్‌చంద్ర సంతాపాన్ని ప్రకటించారు. 

ఆయన పాటగా మనతో ఉంటారు..  
నన్ను పాటల పోటీల్లో ప్రథముడిగా గుర్తించి ప్రోత్సహించారు. అలాంటి ఆయనతోనే నా మొదటి పాట పాడగలగడం, ఆయనతో అనేక చిత్రాల్లో ద్విగళ గీతాలు పాడే అదృష్టం నాకు కలిగింది. మేం స్థాపించిన స్వరమాధురి సంస్థను అనేక రకాలుగా ప్రోత్సహించారు. ఎప్పుడు పిలిచినా వచ్చేవారు. చిత్రపరిశ్రమలో నాకు అన్నగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ఉంటూ నా సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. నాకు గుండెకి సర్జరీ జరిగితే ఇంటికి వచ్చి ధైర్యాన్ని చెప్పారు. ఆయన కేవలం వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానూ మరచిపోలేని మహోన్నతుడు. ఆయన్ను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రలున్నంత వరకూ ఆయన పాట ఉంటుంది.  
– జి.ఆనంద్, గాయకులు, స్వరమాధురి సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement