సాక్షి, చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయంగా ధృవీకరించారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.
ఇంజనీర్ కాబోయి సింగర్ అయ్యారు
ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు చరణ్, పల్లవి ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
తమ్ముడి మీద ప్రేమతో నిర్మాతగా మారిన బాలు
తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. తమ్ముడు కమల్ హాసన్‌కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిని 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేషన్ వంటి పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. తర్వాత పవిత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్, మిథునం వంటి పలు సినిమాల్లోనూ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment