‘తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్ అన్ని తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి తెలుగు పదాలు తెలుస్తాయి. అర్జున ఫల్గుణ అనేది ఈ తరం పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను తెలుగు టైటిల్స్‌ని ఇష్టపడతా’అన్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ ’.అమృతా అయ్యర్ హీరోయిన్‌గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మర్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.
►అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ,విజయ ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి.
► గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను.
► డిగ్రీలు పూర్తి చేసి ఊర్లోనే ఉన్న ఐదుగురి స్నేహితుల కథే ఈ సినిమా. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో మా క్యారెక్టర్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించాం. కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.
► ఇది వరకు చాలా సినిమాల్లో కొంతమేర గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.
► తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.
► అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగు ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు.
► రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ , శివాజీ రాజా, సుబ్బరాజు అందరూ అద్భుతంగా నటించారు.
► రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు.రియలిస్ట్ కథలే నా బలం.
► నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం.
► ప్రస్తుతం భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment