Arjuna Phalguna
-
ఓటీటీలో అర్జున ఫల్గుణ.. ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అంటే..
Sree Vishnu Arjuna Phalguna In OTT: మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. అతడు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ సినిమా డిసెంబర్ 31న రిలీజైంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ట్రాక్ ఎక్కింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రమే ఆడిన అర్జున ఫల్గుణ ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి! A fun yet thrilling ride of friendship, love & greed will premiere on Jan 26. #ArjunaPhalgunaOnAHA@sreevishnuoffl @MatineeEnt @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @adityamusic pic.twitter.com/OCzWaiB8fW — ahavideoIN (@ahavideoIN) January 13, 2022 -
‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున ఫల్గుణ నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేశ్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, ‘రంగస్థలం’మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : తేజ మార్ని సంగీతం : ప్రియదర్శన్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి విడుదల తేది : డిసెంబర్ 31,2021 వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. .. విలక్షణ నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ టాలెంటెండ్ హీరో.. తాజాగా ‘అర్జున ఫల్గుణ’అంటూ మరో డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అర్జున ఫల్గుణ’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం. ‘అర్జున ఫల్గుణ’కథేంటంటే..? డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. (రాజ్‌కుమార్ ఎలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు యాక్టింగ్ ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన మోసుకొచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్నిచోట్ల నవ్వించాడు. ఇక శ్రీవిష్ణుకు జతగా శ్రావణి పాత్రలో అమృత అయ్యర్ మంచి నటనను కనబర్చింది. పల్లెటూరి అమ్మాయిలా తెరపై అందంగా కనబడింది. హీరో స్నేహితులుగా రంగస్థలం మహేశ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చక్కగా నటించారు. ఇక కన్నింగ్ కరణంగా నరేశ్, రైతుగా దేవీ ప్రసాద్, హీరో తండ్రిగా శివాజీ రాజా తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పోలీసాఫిసర్గా సుబ్బరాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్ అవుతుంది. రొటీన్ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు. తొలి సినిమా ‘జోహార్’తో మంచి మార్కులు కొట్టేసినా తేజ.. ‘అర్జున ఫల్గుణ’మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథ, కథనం రెండూ రోటీన్‌గా ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురి నిరుద్యోగుల నేపథ్యాన్ని కథాంశంగా మలచుకొని ‘అర్జున ఫల్గుణ’సినిమాన్ని తెరకెక్కించాడు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం రోటీన్‌గా చూపించడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకుడి ఊహకందే విధంగా కథనం సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్, లవ్, పల్లెటూరి చమత్కారం.. ఇలా కథలో జొప్పించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. వాటిని చేచేతూలా చేజార్చుకున్నాడు. అర్జుణుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం అంటూ పెద్ద పెద్ద పదాలతో కథను ప్రారంభించిన దర్శకుడు.. చివరకు గమ్యంలేని ప్రయాణంలా మార్చేశాడు. అయితే సుధీర్ వర్మ డైలాగ్స్ మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ప్రియదర్శన్ సంగీతం కొంతమేర ఆకట్టుకున్నా.. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతిగా అనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కథలను ఎంచుకోవడంతో దిట్ట అయినా శ్రీవిష్ణువు.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త బోల్తా పడ్డాడనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ హీరోని ఏమనాలో తెలియడంలేదు: దిల్‌రాజు
‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడంలేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజా మార్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కొత్త దర్శకులు నాకు కథలు చెప్పినప్పుడు వాటిలో రెండు, మూడు కథలను శ్రీ విష్ణుతో షేర్ చేస్తాను. కొత్తవారికి చాన్స్ ఇస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నిర్మాతలను అభినందిస్తున్నాను. వీరి ప్రయత్నాలు పెద్ద సక్సెస్‌లు కావాలని కోరుకుంటున్నాను. ‘అర్జున ఫల్గుణ’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీకి ఉత్తి చేతుల్తో వచ్చాను నేను. ఇప్పుడు చాలా ఆస్తి ఉంది నాకు. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి. స్నేహితులైన ఐదుగురు అమాయకులు ఓ చిన్న సమస్యలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు? అన్నదే ‘అర్జున ఫల్గుణ’ కథ’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఓ వేదికపై మైక్ పట్టుకుని నేను మాట్లాడటం ఇదే మొదటిసారి. కొత్త కొత్త దర్శకులకు శ్రీ విష్ణు ఓ ధైర్యం. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడివరకు తీసుకువచ్చింది’’ అన్నారు తేజ మార్ని. ‘‘శ్రీ విష్ణు చేసిన 15 చిత్రాల్లో పదిమంది కొత్త దర్శకులే’’ అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. ‘‘చాలామంది దర్శకులను పరిచయం చేసిన శ్రీ విష్ణును నేను ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో దర్శకులు వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర, వెంకటేశ్ మహా, మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే తెలుగు టైటిల్స్ పెడతా.. ఆ కథలే నా బలం: శ్రీవిష్ణు
‘తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్ అన్ని తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి తెలుగు పదాలు తెలుస్తాయి. అర్జున ఫల్గుణ అనేది ఈ తరం పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను తెలుగు టైటిల్స్‌ని ఇష్టపడతా’అన్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ ’.అమృతా అయ్యర్ హీరోయిన్గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మర్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ►అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ,విజయ ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ► గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను. ► డిగ్రీలు పూర్తి చేసి ఊర్లోనే ఉన్న ఐదుగురి స్నేహితుల కథే ఈ సినిమా. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో మా క్యారెక్టర్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించాం. కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం. ► ఇది వరకు చాలా సినిమాల్లో కొంతమేర గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది. ► తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది. ► అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగు ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు. ► రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ , శివాజీ రాజా, సుబ్బరాజు అందరూ అద్భుతంగా నటించారు. ► రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు.రియలిస్ట్ కథలే నా బలం. ► నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ► ప్రస్తుతం భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి. -
శ్రీ విష్ణు కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
Arjuna Phalguna Movie Release Date: విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవల ఆయన నటించిన 'రాజరాజ చోర' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 31న మూవీ రిలీజ్ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి!