దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో(సీఏఏ)తో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీకి నోచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ఛెల్లో షోను ఎంపిక చేసిన కొద్ది రోజులకే రాజమౌళి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ ఎంట్రీలో చుక్కెదురైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పదివారాలు ట్రెండ్ అయిన నాన్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. అమెరికా కాలిఫోర్నియా హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న సీఏఏ ఏజెన్సీ ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ రంగాల‍్లో పలు రకాల సేవలందిస్తోంది.
(చదవండి: ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో)
గుజరాతీ చిత్రం ఛెల్లో షోను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేయడంతో దేశవ్యాప్తంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్‌కు మద్దతుగా పోస్టులు కూడా చేశారు. ఈ నిర్ణయంపై కొందరు టాలీవుడ్ నటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వేరియెన్స్ ఫిల్మ్స్ సంస్థ సైతం మద్దతు తెలిపింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కేటగిరీలో ఈ చిత్రాన్ని పరిగణించాలని అభ్యర్థించింది. ఆస్కార్ ఎంట్రీకి ఆర్ఆర్ఆర్ ఎంపిక కాకపోవడంపై హాలీవుడ్ డైరెక్టర్ ఆడమ్ మెక్‌కే కూడా స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తమ చిత్రాల విభాగంలో నామినేట్ చేయాల్సిందిగా మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment