సూపర్ స్టార్ కృష్ణ(79) మరణం అభిమానులకు, సినీ, రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిత్రపరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు సాధించిన కృష్ణ.. రాజకీయాల్లోనూ రాణించాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్నేహంతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ.. ఎన్టీఆర్‌ని ధీటుగా ఎదుర్కొన్నాడు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి ప్రభంజనం కొనసాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
(చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!)
1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎంపీగా ఉన్నసమయంలో పార్లమెంట్ కమిటీల్లో చురుకుగా పాల్గొన్నారు. కన్సల్టెటివ్ కమిటిలోను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో కూడా విశేష సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment