చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ | Supriya Yarlagadda Talk About Anubhavinchu Raja Movie | Sakshi
Sakshi News home page

అందుకే ‘అనుభవించు రాజా’సినిమా చేశా:  నిర్మాత సుప్రియ యార్లగడ్డ

Published Sat, Nov 20 2021 7:14 PM | Last Updated on Sat, Nov 20 2021 7:14 PM

Supriya Yarlagadda Talk About Anubhavinchu Raja Movie - Sakshi

‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం’అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా.  అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్న మామ (నాగార్జున) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్న మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్న మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను.

ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది. 

రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను.

సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్‌డౌన్‌ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు.

చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. 

ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా.

ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జునకి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు.

ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా.

నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది.

ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో  ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు.

ఫ్యూచర్‌లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement