
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో అభిమానులను పలకరించింది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయింది అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, తమిళ స్టార్ రజినీకాంత్‌తో జైలర్ చిత్రంలో కనిపించనుంది భామ. ఇటీవల ఈ రెండు సినిమాలపై గురించి ఆసక్తికర విషయాలను పంచకుంది భామ. ఇద్దరు అగ్రహీరోలతో నటిస్తానని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదని అన్నారు.
తమన్నా మాట్లాడుతూ.. ' రజినీకాంత్ సర్ పక్కన నటిస్తానని నేనెప్పుడు అనుకోలేదు. ఈరోజు నాకల నిజమైంది. ఆయన సెట్‌లో చూసే రోజు వెయిట్ చేశా. గతంలో చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించా. కానీ మళ్లీ భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఆతృతగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. కాగా.. హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ. మలయాళంలో తెరకెక్కుతున్న బాంద్రా చిత్రంలో కనిపించనుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment