పవన్‌ కల్యాణ్‌ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్ | Tamanna Simhadri Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్

Published Fri, Mar 1 2024 12:56 PM | Last Updated on Fri, Mar 1 2024 1:14 PM

Tamanna Simhadri Comments On Pawan Kalyan - Sakshi

విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండర్‌గా అందరికీ పరిచయమే. బిగ్‌బాస్‌ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా సామాజిక సేవల్లో కూడా ముందుంటుంది. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఇండిపెండిట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగింది. కానీ ఓడిపోయింది. ఆ సమయంలో జనసేన నుంచి టికెట్‌ ఆశించినా.. ఆమెకు దక్కకపోవడంతో పలు విమర్శలు చేసింది. ట్రాన్స్‌జెండర్‌ కావడంతో తనకు జనసేనలో టికెట్‌ దక్కలేదని ఆవేదన చెందింది. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆమె మళ్లీ పవన్‌ కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు మద్ధతుగా పలు వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనపై తన అభిమానాన్ని చాటుకుంది. గతంలో పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పలు కామెంట్లు చేశారు.. అప్పుడు కూడా పవన్‌పై అభిమానంతో చింతమనేనిపై ఫైర్‌ అయింది తమన్నా..

వాళ్లందరినీ పవన్‌ నాశనం చేశారు
తాజాగా ఏపీలో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ తీరుపై తాజాగా తమన్నా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఏపీకి పవన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కాపు వర్గానికి చెందిన ఎందరో యువకులు, సాధారణ ప్రజలు రోడ్డెక్కారు. పవన్‌ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ కోసం వాళ్లందరూ కూడా సొంత ఆస్తులను అమ్మకుని అభిమానంతో వచ్చారు. కానీ నేడు చంద్రబాబు బాగు కోసం పవన్‌ వారందరినీ నాశనం చేశారు. నాదెండ్ల మనోహర్‌ మాటలు మాత్రమే వింటున్న ఆయన.. జనసేన కార్యకర్తల బాధలు, కాపు పెద్దల సలహాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.' అని ఆమె తెలిపారు.

పవన్‌ కోసం మేము పోరాడితే..
'వంగవీటి రంగా తర్వాత మా కాపు వర్గానికి ఒక లీడర్‌ వచ్చాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా కాపు వర్గానికి చెందిన పవన్‌కు ఓటు వేలని ప్రతి ఇంటి గడప తొక్కాం.. ఎందరో యువకులు వారి ఉద్యోగాలు వదులుకొని పవన్‌ కోసం ప్రచారం చేసేందుకు వచ్చారు. కానీ నేడు.. పవన్‌ మా లాంటి వారిని నిలువెత్తునా ముంచేశారు. మన పార్టీ జనసేన గెలవాలని మేము పోరాడుతుంటే.. పవన్‌ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 

2019లో టికెట్‌ కోసం వేడుకున్నాను.. కానీ పవన్‌ గారు కనీసం కలవను కూడా లేదు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకునే నేను రాజకీయాల్లోకి వచ్చాను.. కానీ మా లాంటి వారిని కనీసం కలిసే అవకాశమే ఇవ్వకుంటే ఎలా..? అందరిలా పవన్‌ కూడా కోట్ల రూపాయలు తీసుకునే టికెట్‌ ఇస్తే.. మాలాంటి సాధారణ వ్యక్తులు రాజకీయాల్లోకి ఎలా వస్తారు..? హెలికాప్టర్‌లో తిరిగేందుకు ఆస్తులను అమ్ముకున్నానని పవన్‌ చెప్పడం కరెక్ట్‌ కాదు.. కాలినడకతో ప్రజల్లో కలిసి తిరగాలి. అప్పుడే కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుంది.'

ముద్రగడ లాంటి వారికే దిక్కు లేదు 
'నాకు టికెట్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వారికి టికెట్‌ ఇవ్వండి. నాదెండ్ల మనోహర్‌, చంద్రబాబు మాటలు విని కేవలం 24 సీట్లు తీసుకుని జనసేన కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారిని కలుస్తానని పవన్‌ చెప్పారు.. చివరకు అదీ లేదు..  ముద్రగడను పోలీసుల సాయంతో ఇదే చంద్రబాబు నాయుడు ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. అయినా కూడా మీరు బాబుతో పొత్తు పెట్టుకున్నారు. మన కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడనే పవన్‌ కలవలేదు..  

అలాంటిది మా లాంటి ట్రాన్స్‌జెండర్స్‌కు ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్నికలకు దిగుతారు.. పవన్‌ మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు' అని తమన్నా తెలిపింది. తనకు ఏ పార్టీ నాయకులతో పరిచయాలు లేవని తెలిపిన తమన్నా ఇప్పటి వరకు పవన్‌ కోసమే ప్రజల్లో తిరిగానని చెప్పింది. కానీ 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement