బహుభాషా కథానాయకి తమన్నా భాటియా. అయితే ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. చిత్రానికి అవసరం అయితే ఎంత గ్లామరస్‌గానైనా నటించడానికి ఆమె సై అంటారు. కాగా తమన్న ప్రత్యేక పాటలో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అలా తమన్న నటించిన చిత్రాల విజయంలో ఆమె భాగం చాలానే ఉంటుంది. అందుకు నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఒక ఉదాహరణ. అందులో 'నువ్వు కావాలయ్యా..' అనే పాట కుర్రకారును ఉర్రూతలూరించిందనడం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అనిరుద్ సంగీతాన్ని అందించిన ఆ పాటలో నటుడు రజనీకాంత్ కూడా ఒక సహాయ నటుడిగా కనిపించారు.
మరో విషయం ఏమిటంటే ఆ పాటలో నటి తమన్న డ్రస్, ఆమె స్టెప్స్‌కు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అలాంటి పాటలో తన నటన గురించి తమన్న ఇటీవల తన సోషల్ మీడియాలో పేర్కొంటూ జైలర్ చిత్రంలోని పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు. ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన హిందీ చిత్రం స్త్రీ 2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' అనే పాటలో నటించాననీ, ఆ పాటలో నటన సంతృప్తి కలిగించిందని చెప్పారు.
ఆ పాటలో నటన గురించి ఆ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్ స్పందిస్తూ ఆజ్ కీ రాత్ పాటకు నటి తమన్నా ఆ పాత్రగానే మారారని చెప్పడమే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాగా నటుడు రజనీకాంత్ త్వరలో జైలర్– 2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ తమన్నాకు ఐటమ్ సాంగ్ ఉంటుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment