శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టిందని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోయామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. కొందరు చేసిన మోసంతో ఇప్పటికీ ఓటీటీలో కూడా సినిమాను విడుదల చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని శర్వానంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల అయ్యి మూడు నెలలు అవుతున్నా ఓటీటీలోకి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. అందుకు కారణాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఇలా తెలిపారు. మనమే సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయానని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక సంస్థకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను అప్పగిస్తే.. ఆ సంస్థ మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పలు కారణాలు చెబుతూ మనమే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమ్మలేదని ఆయన అన్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని విశ్వప్రసాద్ తెలిపారు.
మనమే సినిమాకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసిన వారు తమకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో సుమారు 70 శాతం వరకు నష్టం వచ్చినట్లు ప్రకటించారు. వారు చేసిన మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. మనమే సినిమాను మాత్రమే ఆపేసి ఇతర సినిమాలను మాత్రం వారు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే మనమే సినిమా ఓటీటీ విడుదల విషయంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment