తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరే క్రేజ్‌కు బ్రాండ్ అంబాసిడర్. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని క్రేజ్, స్టైల్ ఈయన సొంతం. ప్రస్తుతం 169 నాటౌట్ గా నిలిచిన రజనీకాంత్ 170వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని భారీ అంచనాల మధ్య ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్ర షూటింగు పూర్తయింది. దీంతో తన 170వ చిత్రానికి రజనీకాంత్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నట్లు, దీన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు ఇంతకుముందే అధికారికంగా ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే.
కాగా తాజాగా క్రేజీ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ అమితాబచ్చన్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, తెలుగు నటుడు నాని ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ఇక మలయాళ బ్యూటీ మంజువారియర్ ఇందులో రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరో విషయం ఏంటంటే రజనీకాంత్‌ను పోలీసు పాత్రలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఇంతకుముందు దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ తాజాగా చిత్రంలోని ఆ తరహా పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. లేకపోతే ఆయన 170 చిత్రంలోను పోలీస్ అధికారిగా నటించనున్నట్లు సమాచారం. ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న కథాచిత్రం. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న దీనికి వేట్టైయాన్( Vettaiyan) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ టైటిల్ డైరెక్టర్ విన్సెంట్ సెల్వ వద్ద ఉందని, రజనీకాంత్ కోసం ఆయన ఇది వదులుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment