
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ‘సాని కాయిదమ్’ చిత్రంతో యాక్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ మరో ప్రధాన పాత్రధారి. తాజాగా సెల్వరాఘవన్ ‘బీస్ట్’ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఉపారు. విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘బీస్ట్’ సినిమాలో నటించే కొందరి యాక్టర్స్ పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు.
సెల్వరాఘవన్‌తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్ ఫరూకీ, షైన్ టామ్ చాకో, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికాల్‌లు కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో సెల్వరాఘవన్ విలన్ రోల్ చేయనున్నారని టాక్. ఇక దర్శకుడిగా ‘నానే వరువేన్’, ‘యుగానికి ఒక్కడు 2’ చిత్రాలను సెల్వరాఘవన్ తెరకెక్కించనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది.