
తెలుగు నేలపై థియేటర్లు మళ్ళీ కొత్త సినిమాలతో కళకళలాడేదెప్పుడు? ఇప్పుడు అందరి ప్రశ్నా ఇదే. ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని సినీ వర్గాల భోగట్టా. ఇటు తెలంగాణలో ఇప్పటికే థియేటర్స్‌లో వంద శాతం సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఉన్నాయి. అంటే... ఇక సినిమాలు విడుదల కావడమే ఆలస్యం. నిజానికి లాక్‌డౌన్‌కి ముందే నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’ వంటివి విడుదలకు సిద్ధమయ్యాయి. మరి.. థియేటర్ల రీ–ఓపెన్ అయితే, ఇవి వెంటనే తెర మీదకు వస్తాయా?
సినీ వర్గాల కథనం ప్రకారం... ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదట్లో కానీ కొత్త సినిమాలు రాకపోవచ్చు. ఎందుకంటే, తెలంగాణలో విద్యుత్ ఛార్జీల రాయితీలకు హామీ, పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి వంటి విషయాల్లో ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అవి నెరవేరితేనే థియేటర్ల మనుగడకు మార్గం సుగమం అవుతుందని కొందరు ఎగ్జిబిటర్ల వాదన. అలాగే ఏపీలో తగ్గించిన టికెట్ ధరలలో కొంత పెరుగుదలను ఆశిస్తున్నామని కూడా వారు అన్నారు. థియేటర్ల మనుగడ కోసం‡రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.